హోరాహోరీగా సాగిన బల్దియా పోరులో కమలం వికసిస్తోందని భాజపా నేతలు భావిస్తున్నారు. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని భాజపా రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత భాజపాకు కలిసి వస్తోందని యోచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెట్టిన సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి కేటాయించిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, తెరాసకు దీటుగా చేసిన ప్రచారం, కేంద్ర మంత్రులు, జాతీయ నాయకుల ప్రచారం కలిసి వస్తోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకతే మా గెలుపు
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో మాత్రం ఏకంగా మేయర్ పీఠానికే గురి పెట్టింది. తెరాస, భాజపాకు ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ప్రజలు భాజపా వైపే నిలిచారని చెబుతున్నారు. రెండు పడక గదుల ఇళ్ల ఆశ చూపడంతో గత ఎన్నికల్లో ప్రజలు తెరాసకు పట్టం కట్టారని..ఇచ్చిన హామీని ఐదేళ్ల అయిన నెరవేర్చకపోవడం పట్ల వ్యతిరేకత మూటకట్టుకుందని చెబుతున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత భాజపాకు ఓటు బ్యాంకుగా మారుతోందని భావిస్తున్నారు.
కమలనాథుల ఆశాభావం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 38 డివిజన్లు ఉండగా అందులో 20 స్థానాలు కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 8 నుంచి 10, మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో 10 స్థానాలు దక్కుతాయని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పోలింగ్ శాతం తెరాసకు అనుకూలంగా ఉన్నదైతే భాజపాకు కొంత కలిసి వచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు. మరోవైపు పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో ముస్లింలు తెరాసకు ఓట్లు వేసినట్లు సమాచారం ఉందని కమలనాథులు చెబుతున్నారు. ఇక్కడ ఓట్లు చీలిన నేపథ్యంలో ఆది భాజపాకి లబ్ధి చేకూరుస్తోదని లెక్కలు వేసుకుంటున్నారు.
మేయర్ పీఠం మాకే
భాజపాకు మేయర్ సీటు దక్కాలంటే 99 మంది కార్పొరేటర్ల బలం కావాలి. మూడు ఎక్స్ అఫిషియో ఓట్లు భాజపా ఖాతాలో ఉండడంతో బల్దియా పీఠాన్ని సునాయాసంగా కైవసం చేసుకోవచ్చు. నాలుగు కార్పొరేట్ స్థానాలు ఉన్న భాజపా ఒక్కసారిగా వంద సీట్లు గెలుస్తోందా అనేది చర్చనీయాంశంగా మారింది. పార్టీలోని కొంతమంది నేతలు మాత్రం 50 నుంచి 60 స్థానాలు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజకీయ వర్గాలు మాత్రం భాజపా 20 నుంచి 30సీట్లు గెలిచే అవకాశం ఉందని చెబుతున్నాయి.
బల్దియా పీఠాన్ని కైవసం చేసుకుంటామని దీమా వ్యక్తం చేస్తున్న కమలనాథులు గులాబీ వనంలో కమలాన్ని వికసింప చేస్తారో లేదో ఈ నెల 4 వరకు వేచి చూడాలి.
ఇవీ చూడండి: 'గ్రేట్' పోలింగ్ 46.6శాతం.. రికార్డుస్థాయిలో నమోదు