ఇదీ సమస్య అని తెలిసీ పరిష్కరించకపోతే..? ఆ ప్రభావం ప్రతికూలంగా ఉంటుందన్న హెచ్చరికలనూ పట్టించుకోకపోతే..? భారత్‌లో వాయుకాలుష్యం విషయంలో ఇదే జరిగింది. ఆ ఫలితాలు అనుభవించాల్సి వస్తోంది. స్వచ్ఛమైన గాలినీ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుందేమోనన్న ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి ఇక్కడి స్థితిగతులు. వందలు కాదు వేలు కాదు.. లక్షలాది మంది కేవలం వాయు కాలుష్యంతో ప్రాణాలు కోల్పోతున్నారన్న గణంకాలు చాలవా.. దేశంలో పరిస్థితులెలా ఉన్నాయో చెప్పటానికి. అసలే పడిపడి లేస్తున్న జీడీపీపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది గాలి కాలుష్యం. లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోతున్నాయన్న లెక్కలు కలవర పెడుతున్నాయి.
2 లక్షల 60 వేల కోట్ల రూపాయల నష్టం..
వాయు కాలుష్యం భారత్‌కు ఎన్ని విధాలా నష్టం కలిగిస్తోందో.. ఇప్పటికే ఎన్నో నివేదికలు వివరించాయి. ఇప్పుడు కొత్తగా.. ఇండియా-స్టేట్ లెవల్ డిసీజ్ బర్డన్ ఇనిషియేటివ్ పేరుతో ఓ అధ్యయన నివేదిక ‘లాన్సెట్ ప్లానెటరీ హెల్త్’ జర్నల్‌లో ప్రచురితమైంది. జీడీపీలో 1.4 శాతాన్ని.. అంటే అక్షరాలా రెండు లక్షల 60 వేల కోట్ల రూపాయలను ఈ కాలుష్యం కారణంగా గతేడాది భారత్ నష్టపోయిందని వెల్లడించింది. 2019లో దేశ వ్యాప్తంగా 17 లక్షల మంది మరణాలకు ఈ భూతమే కారణమనీ తెలిపింది. మూడు దశాబ్దాల్లో గృహ సంబంధిత కాలుష్యం తగ్గుముఖం పట్టడం ఊరట కలిగించే విషయమే అయినా.. అదే సమయంలో బహిరంగ కాలుష్యం పెరగడం ఆందోళన కలిగిస్తున్నట్లు పేర్కొంది. దేశ ఆర్థిక, వైద్య ఆరోగ్య రంగాలపై వాయు కాలుష్యం చూపుతున్న ప్రభావాన్ని ఈ నివేదికలో విశ్లేషించారు.
17 లక్షల మంది ప్రాణాలు బలి..
గతేడాది వాయు కాలుష్య ప్రభావంతో భారత్‌లో 17 లక్షల మంది ప్రాణాలు విడిచారు. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం మరణాల్లో ఆ సంఖ్య 18 శాతంగా ఉంది. గృహ సంబంధిత కాలుష్యం భారత్‌లో గణనీయంగా తగ్గింది. అయితే- గృహాల నుంచి వెలువడే కాలుష్యం కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య ఇప్పటికీ అధికంగానే ఉంటోంది. గతేడాది 6.1 లక్షల మంది ప్రాణాలను అది మింగేసింది. దేశంలో బహిరంగ వాయు కాలుష్యం 115% మేర, ఓజోన్ కాలుష్యం 139.2% మేర పెరిగింది. గాలి కాలుష్యం కారణంగా నమోదవుతున్న మరణాలు, చుట్టుముట్టిన అనారోగ్య సమస్యల కారణంగా 2019లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్.. జీడీపీలో 2.2 శాతాన్ని నష్టపోయింది. తర్వాతి స్థానంలో బిహార్ ఉంది.
దిల్లీపై అధిక ప్రభావం..
దేశానికే కాదు.. వాయుకాలుష్యానికీ రాజధానిగా మారిన దిల్లీ అన్నింటికంటే ఎక్కువ నష్టాన్ని చవిచూసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ కూడా భారీగానే మూల్యం చెల్లించుకున్నాయి. దేశంలో ప్రతి ఘనపు మీటరు గాలిలో సగటున 91.7 మైక్రోగ్రాముల ధూళి రేణువులు ఉంటున్నాయి. వీటి పరిమాణం కేరళలో 15.8 మైక్రో గ్రాములకు పరిమితమైతే.. దిల్లీలో 217.6 మైక్రోగ్రాముల వరకూ ఉంటోంది. కేరళతో పోలిస్తే దిల్లీలో కాలుష్యం 13.8 రెట్లు అధికంగా ఉంది. ఉత్తర భారత రాష్ట్రాలన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. దిల్లీ, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్, బిహార్ రెడ్‌జోన్‌లో ఉండగా.. రాజస్థాన్, ఝార్ఖండ్ ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. 2019లో దేశంలో 56.3% మంది ప్రజలు వంట కోసం ఘన ఇంధనం వాడగా.. వీరిలో అత్యధికులు ఈశాన్య, ఉత్తర భారత రాష్ట్రాలకు చెందినవారే.
దక్షిణాది రాష్ట్రాలు మెరుగ్గా..
ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మెరుగ్గా ఉంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో ప్రతి ఘనపు మీటరుకు ధూళి కణాలు 20-39.9 మైక్రోగ్రాముల మధ్య ఉన్నాయి. తెలంగాణలో మాత్రం కాలుష్య తీవ్రత కాస్త ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఓజోన్ కాలుష్యం పరంగా ఆరెంజ్ జోన్లో చేరాయి. వంట కోసం ఘన ఇంధనం వాడే వారి సంఖ్య తమిళనాడు, తెలంగాణల్లో 30% లోపు ఉండగా, ఏపీలో 30-39.9% వరకు ఉంది. కర్ణాటక, కేరళల్లో ఇలాంటి వారి సంఖ్య 30-49.9% వరకు ఉంది. గతేడాది వాయు కాలుష్యం కారణంగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తమ జీడీపీల్లో 1% నుంచి 1.24% వరకు నష్టపోయాయి. తెలంగాణ, కేరళల్లో ఈ నష్టం 0.75% నుంచి 0.99% వరకే ఉంది.
ఆందోళన కలిగిస్తోన్న మరణాలు..
లాన్సెట్తో పాటు.. మరో నివేదిక ఇవే విషయాలు స్పష్టం చేసింది. దేశంలో గతేడాది అత్యధిక వాయు కాలుష్యం నమోదైందని.. స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్-ఎస్వోజీఏ 2020 నివేదిక తెలిపింది. వాయు కాలుష్యం వల్ల 2019లో లక్షా 16 వేల మంది పసికందులు మరణించారన్న గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పుట్టిన నెలరోజుల్లోపే వారు మృత్యు ఒడిలోకి చేరుకున్నారని ఈ నివేదిక వెల్లడించింది. సగానికి సగం మరణాలకు అతి సూక్ష్మస్థాయి ధూళి కణాలు కారణం కాగా కర్రబొగ్గు, కలప, పిడకలు వంటివి వంట కోసం వాడడం వల్ల వెలువడే కాలుష్యం.. మిగిలిన ప్రాణ నష్టానికి కారణమవుతోంది. కాలుష్యం కారణంగా పక్షవాతం, గుండె పోటు, మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధులు వంటివాటికి గురై లక్షల మంది చనిపోతున్నారని నివేదిక చెబుతోంది.
నాలుగో స్థానంలో వాయు కాలుష్యం..
భారత్ తరవాత.. నేపాల్, నైగర్, నైజీరియా, ఖతార్‌లు అత్యధికంగా కాలుష్యం విడుదల చేస్తున్నాయి. అత్యధిక జనాభా గల 20 దేశాల్లో 14 దేశాలు గాలి నాణ్యతను మెరుగు పరచుకున్నాయి. భారత్, బంగ్లాదేశ్, నైగర్, పాకిస్థాన్, నేపాల్, జపాన్ మాత్రం అత్యధిక కాలుష్యాన్ని నమోదు చేశాయి. ప్రపంచంలో ప్రాణాంతకంగా మారి, ఆరోగ్యానికి ముప్పు తెచ్చే అంశాల్లో వాయు కాలుష్యం నాలుగో స్థానాన్ని ఆక్రమించగా, భారత్‌లో అకాల మరణాలకిది ప్రధాన కారణంగా ఉంది. అత్యధిక ఓజోన్ విడుదల చేసే దేశాల్లో ఖతార్, నేపాల్‌లు మొదటి రెండు స్థానాల్లో ఉండగా భారత్ మూడో స్థానాన్ని ఆక్రమించింది.