‘రాష్ట్రంలో విద్యారంగాన్ని సంపూర్ణంగా, సమగ్రంగా ఉన్నతీకరించేందుకు రూ.4 వేల కోట్లతో సరికొత్త విద్యా పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. రాబోయే రెండేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టబోతున్నాం’... ఈ ఏడాది మార్చి 18న బడ్జెట్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చేసిన ప్రకటన ఇది. ఆరు నెలలైనా ఇది అమల్లోకి రాలేదు. పథకాన్ని ప్రకటించిన రోజే విధి విధానాల రూపకల్పనకు ప్రభుత్వం అయిదుగురు మంత్రులతో ఉపసంఘాన్ని నియమించింది. కమిటీ నివేదిక సమర్పించి మూడు నెలలు కావొస్తున్నా అడుగు ముందుకు పడలేదు. ఫలితంగా బడుల్లో వసతుల తీరు నానాటికీ దిగజారుతోంది. పాఠశాలలు పునఃప్రారంభం కావడం, వర్షాకాలం కావడంతో శిథిల భవనాలున్న చోట తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ఆందోళన చెందుతున్నారు.
ప్రత్యేక నిధుల కేటాయింపు
పాఠశాల విద్యాశాఖకు కేటాయించే రూ. 10 వేల కోట్ల బడ్జెట్ నుంచి జీతాలు, తదితరాలకే అధిక మొత్తం వ్యయమవుతుండడంతో బడుల్లో వసతుల కల్పనకు నిధులివ్వలేని స్థితి. ఈ క్రమంలోనే విడిగా ఏటా రూ.2 వేల కోట్ల చొప్పున వరుసగా రెండేళ్లలో రూ.4 వేల కోట్లతో వసతులు మెరుగుపరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం నాడు-నేడు పథకం కోసం రూపొందించుకున్న సాఫ్ట్‌వేర్‌నే ఇక్కడా వినియోగించుకోవాలని నిర్ణయించారు. భవనాలు, మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణం, ఫర్నిచర్, రంగులు వేయడం తదితర 11 రకాల పనులు చేయాలనుకున్నట్లు తెలిసింది. కానీ ఇంతవరకు విధి విధానాలే ఖరారు కాలేదు.
వేగం పుంజుకుంటేనే....
పథకం అమలైతే పనులు మొదలై కనీసం వచ్చే విద్యా సంవత్సరానికి (2022-23) కొన్ని పాఠశాలల్లోనైనా సౌకర్యాలు మెరుగుపడతాయి. జనవరి దాటితే పరీక్షల వాతావరణంలో పనులు చేయడానికి ఇబ్బంది అవుతుందని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.
నిధులు సరిపోయేనా?
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు 26 వేల వరకు ఉన్నాయి. వందలాది బడుల్లో తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి.కొన్నింటి పైకప్పులు రేకులతో ఉన్నాయి. దాదాపు 10 వేల తరగతి గదుల కొరత ఉంది. ఒక్కో దానికి రూ.10 లక్షల చొప్పున రూ.వెయ్యి కోట్లు తరగతి గదుల నిర్మాణానికే అవసరం. సుమారు 8700 బడులకు ప్రహరీలు లేవు. ఇంకా తొమ్మిది వేలకు పైగా మరుగుదొడ్లు నిర్మించాలి. సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, డిజిటల్ బోర్డులు, రంగులు, గేట్లు, ఫర్నిచర్ తదితరాలు కూడా ఏర్పాటు చేయాలంటే రూ.4 వేల కోట్లు సరిపోకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: CM KCR LETTERS: గొప్పగా ఎదిగేందుకే దళితబంధు.. లబ్ధిదారులకు సీఎం లేఖ