గ్రామీణ పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మొదటిసారి ఖైరతాబాద్ కార్యాలయంలో సమావేశమైంది. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్యక్షతన ఈ సమావేశం చేపట్టారు. 30 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలను విజయవంతం చేసిన గ్రామపంచాయతీలకు అవార్డులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పల్లె ప్రగతి నిర్వహణ విషయంలో త్వరలోనే అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యర్యంలో సమావేశాలు నిర్వహించాలని కేబినేట్ సబ్ కమిటీ తెలిపింది.
'వార్షిక క్యాలెండర్ సిద్ధం చేసుకోవాలి'
గ్రామాల్లో ప్రతివారం ప్రత్యేక అధికారులు పర్యటించాలని కమిటీ నిర్దేశించింది. పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన ట్రాక్టర్ల సరఫరా ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించింది. ఇంకుడు గుంతలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, నర్సరీల ఏర్పాటుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలా ప్రణాళికలు ఉండాలని మంత్రుల ఉపసంఘం తెలిపింది. గ్రామాల వారిగా కార్యకలాపాలపై వార్షిక క్యాలెండర్‌ను తయారు చేసుకోవాలని సూచించింది. గ్రామపంచాయతీ చట్టంతో పాటు అన్ని ప్రభుత్వ అంశాలపై డీపీవో, డీఎల్‌వో, ఎంపీవోలు ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి : దేవాదులలోకి దూసుకెళ్లిన ఆటో... తరువాత ఏమైందంటే..!