దక్షిణ మధ్య రైల్వేలో వ్యాపార అభివృద్ధి కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నారు. సరకు రవాణా అభివృద్ధి కోసం డివిజనల్ స్థాయి విభాగాల ఏర్పాటుపై రైల్వే దృష్టిసారించింది. తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ధిపరచే దిశలో భాగంగా రైల్వే బోర్డు సూచనలకు అనుగుణంగా జోనల్, డివిజనల్ స్థాయిల్లో బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్స్ (బీడీయూ)ను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేస్తోంది. 2024 నాటికి సరకు రవాణాను రెట్టింపు చేయడంతోపాటు, నాన్-బల్క్ సరకు రవాణా బలోపేతం చేయడం కోసం ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ జోనల్ స్థాయిలో సంబంధిత అన్ని విభాగాల నుంచి సీనియర్ అడ్మిస్ట్రేటివ్ గ్రేడ్ అధికారులతో మల్టీ డిసిప్లినరీ బిజినెస్ డెవలప్మెంట్ విభాగాన్ని నెలకొల్పారు. ఈ కమిటీ ప్రస్తుత సరకు రవాణా విధానాలను అధ్యయనం చేయటంతోపాటు అదనంగా సరకు రవాణా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వ్యాపారులు, పరిశ్రమవర్గాలతో తరుచుగా సంప్రదింపులు జరుపుతుంది. వేగవంతమైన రవాణా నిర్వహణ కోసం రవాణాలో కొత్త ప్రతిపాదనలకు ఇది నోడల్ కేంద్రంగా సేవలందిస్తుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 6 డివిజన్లలోను సీనియర్ డివిజనల్ ఆపరేటింగ్ మేనేజర్లను డివిజనల్ బీడీయూలకు కో-ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్నారు.