Matrimony Fraud Scams In Hyderabad : పెళ్లి సంబంధం కుదుర్చకోవాలంటే అటు ఏడుతరాలు.. ఇటు ఏడుతరాలు చూడాలనేది ఒకప్పటి మాట. ప్రస్తుతం టెక్నాలజీ పుణ్యమా అని మ్యారేజీ బ్యూరోలే సంబంధాలు చూసేస్తున్నాయి. కనీసం వారి ఇంటికి వెళ్లకుండానే అంతా ఆన్లైన్లోనే సంబంధాలు చూడటం అయిపోతున్నాయి. ఇప్పుడు ఇదే అసలు సమస్యగా మారింది. కొందరు ఆన్లైన్లో నకిలీ వివరాలతో ప్రొఫైల్ పెట్టి ఒంటరిగా ఉన్న కుర్రాళ్లుకు వలపు వలతో టోకరా వేస్తున్నారు. పెళ్లి సంబంధం దొరికింది కదా అని వారిని నమ్మి లక్షలు కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నా ఫిర్యాదు చేయడానికి భాదితులు ముందకు రావట్లేదని ఒక పోలీస్ అధికారి తెలుపుతున్నారు.
ఆమె వయసు 35 నుంచి 40 సంవత్సరాలు ఉంటుంది. ఆన్‌లైన్ వివాహ పరిచయ వేదికల్లో నకిలీ వివరాలతో ప్రొఫైల్ పెట్టింది. వివిధ కారణాలతో భార్య దూరమై జీవితభాగస్వామి కోసం వెదికే పురుషులకు దగ్గరై దొరికినంత దోచుకుంటోంది. ఏపీ, తెలంగాణల్లో ఈ కిలేడీ బారినపడి ఎంతో మంది మోసపోయినట్టు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఒకరిద్దరు బాధితులు తమ బాధను పంచుకున్నా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావట్లేదని ఆయన వివరించారు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో పరిచయమైన యువతి, యువకుడు దగ్గరై బహుమతి కోరినా ఇచ్చేందుకు ప్రయత్నించినా ఆచితూచి స్పందించాలని సూచించారు. మాయలేడి వలపు వలతోఎలా చిత్తు చేస్తుందనేది తెలుసుకోండి.
మ్యాట్రిమోనీ సైట్లలో పెళ్లి పేరిట మోసాలు : బాపట్ల జిల్లాకు చెందిన 55 సంవత్సరాల మధ్య వయస్కుడు. సమాజంలో మంచి గౌరవం, ఉద్యోగం ఉన్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య కారణంగా మనోవేదన అనుభవిస్తున్నాడు. భార్య సూచనతో మ్యాట్రిమోనీ సైట్‌లో రెండో వివాహానికి సిద్ధమయ్యాడు. దీంతో ఆన్లైన్లో మహిళల వివరాలు వెతికాడు. వారిలో నగరానికి చెందిన ఒక మహిళ పరిచయం అయింది. ఇద్దరూ కాల్, చాట్ చేసుకుంటా రోజులు గడుపుతున్నారు.
ఇటీవల తనను కలిసేందుకు హైదరాబాద్ రావాలని కోరింది. దీంతో సంతోషంతో బుల్లెట్ బండెక్కి రయ్మని హైదరాబాద్ చేరుకున్నాడు. ఆమె సౌందర్యం మాటతీరు నచ్చటంతో అతడు తెగ మురిసిపోయాడు. అతడి అమాయకత్వాన్ని గమనించిన ఆమె అతడి డెబిట్ కార్డుతో హైదరాబాద్లోని షాపింగ్మాల్లో రూ.40వేల షాపింగ్ చేసింది. అనంతరం బయటకు వచ్చి హోటల్‌లో భోజనం చేశారు. అంతలో పోలీసు కానిస్టేబుల్ వారి సమీపంలోకి వచ్చాడు. భయపడినట్టు నటించిన మహిళ మరోసారి కలుద్దామంటూ వెళ్లిపోయింది.
ఒకరికొకరు నచ్చామనే అభిప్రాయంతో అతడు తన ఊరికి వెళ్లి పోయాడు. తర్వాత కాల్ చేస్తే అమ్మమ్మ చనిపోయిందని కొన్ని నెలల వరకు పెళ్లి జరగకూడదంటూ చెప్పి మొబైల్ స్విచ్చాఫ్ చేసింది. దీంతో మోసపోయానని గ్రహించాడు. ఇలా చాలా మంది ఆన్లైన్లో వివాహ పరిచయ వేదికల్లో నమ్మి మోసపోయారు. విజయవాడకు చెందిన విశ్రాంత ఉద్యోగిని పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి వధూవరుల వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలుకు రూ.2.5లక్షలు కాజేసింది. సికింద్రాబాద్‌లో విశ్రాంత ఆర్మీ అధికారికి మ్యాట్రిమోనీలో పరిచయమైన ఒక యువతి షాపింగ్ పేరుతో రూ.5లక్షల వరకు మోసం చేసింది.
80 ఏళ్ల వయసులో తోడు కోసం వృద్ధుడి ప్రకటన - పెళ్లికి ఓకే చెప్పిన ఇద్దరు మహిళలు - చివర్లో ట్విస్ట్!
మ్యాట్రిమోనీ సైట్‌లో మాయ లేడి.. నగ్న వీడియోలతో బ్లాక్మెయిల్.. టెకీకి రూ. కోటికిపైగా టోకరా