Pepper Rice Recipe : ఉదయాన్నే ఇతర పనులన్నీ చేసుకుంటూ.. మరోవైపు పిల్లల కోసం లంచ్ బాక్స్ రెడీ చేయడం తల్లులకు రోజూ సవాలే. ఇంటి పనులు మొదలు బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసి.. మళ్లీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం, ఇతరత్రా పనులు చూసుకోవడంతో అంతా హడావిడిగా ఉంటుంది. దీంతో.. ఉన్న కాస్త టైమ్‌లోనే వైట్ రైస్ వండి.. ఏదోక కర్రీ బాక్స్‌లో పెట్టి పిల్లలని స్కూల్‌కి పంపిస్తుంటారు. నిత్యం ఇదే పరిస్థితి కావడంతో.. కొన్నిసార్లు పిల్లలు ఆ లంచ్ బాక్స్ పూర్తిగా తినకుండానే ఇంటికి తీసుకొస్తుంటారు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తున్నారా ? అయితే, మీ కోసమే స్పెషల్ లంచ్ బాక్స్ తీసుకొచ్చాం. అదే టేస్టీ అండ్ హెల్దీ "పెప్పర్ రైస్".
ఈ స్టోరీలో చెప్పిన విధంగా పెప్పర్ రైస్ ప్రిపేర్ చేసి పెడితే మెతుకు కూడా మిగల్చకుండా ఎంతో ఇష్టంగా లాగిస్తారు. ఈ రైస్ చేయడానికి ఎక్కువ టైమ్ కూడా పట్టదు. మరి, ఇంకెందుకు ఆలస్యం? నిమిషాల్లోనే ఈ రైస్‌ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
పెప్పర్ రైస్ కోసం కావాల్సిన పదార్థాలు :
- ఉల్లిపాయలు-2
- ఎండుమిర్చిలు-4
- నూనె - సరిపడా
- అన్నం-2 కప్పులు
- మిరియాలు- టేబుల్‌స్పూన్
- జీలకర్ర- టీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు-15
- కరివేపాకు-2
- టమాటా- 2
- పసుపు-అర టీస్పూన్
- ఇంగువ- చిటికెడు
- జీడిపప్పులు-కొద్దిగా
- కొత్తిమీర-కొద్దిగా
పెప్పర్ రైస్ తయారీ విధానం..
- ముందుగా పాన్‌లో కొద్దిగా నూనె వేసుకోండి. (మీకు నచ్చితే ఈ రైస్ చేయడానికి నెయ్యిని కూడా ఉపయోగించుకోవచ్చు.)
- నూనె వేడయ్యాక గిన్నెలో ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర వేసి వేపండి. ఎండుమిర్చి, మిరియాలు దోరగా వేగిన తర్వాత వాటిని తీసి కచ్చాపచ్చాగా దంచుకోండి.
- ఇప్పుడు అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేయండి. వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ఇంగువ, జీడిపప్పులు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి.
- అలాగే టమాటా ముక్కలు వేసి కొద్దిసేపు మగ్గించండి. ఇప్పుడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి వేపండి.
- తర్వాత పొడిపొడిగా వండుకున్న అన్నం వేసి మిక్స్ చేయండి. అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న ఎండుమిర్చి-మిరియాల పొడి వేసి బాగా కలపండి.
- స్టౌ ఆఫ్ చేసే ముందు కాస్త కొత్తిమీర చల్లి దింపుకుంటే సరిపోతుంది.
- అంతే.. ఇలా సింపుల్‌గా చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోనే మీ ముందు వేడివేడి పెప్పర్ రైస్ తయారైపోతుంది.
- ఈ రైస్ ఒక్కసారి తిన్నారంటే.. తప్పకుండా మళ్లీ ప్రిపేర్ చేసుకుంటారు.
- నచ్చితే మీరు కూడా ఇంట్లో ఈ పెప్పర్ రైస్ తయారు చేసేయండి.
ఇవి కూడా చదవండి :
లంచ్ బాక్స్ స్పెషల్ - యమ్మీ యమ్మీ "ఆలూ రైస్" - ఇలా చేస్తే పిల్లలు అస్సలు వద్దనకుండా తినేస్తారు!
సూపర్ లంచ్ బాక్స్ రెసిపీ : తమిళనాడు స్టైల్ "వెజ్ కుష్కా" - దీని టేస్ట్ ముందు బిర్యానీ కూడా బలాదూర్!