రైల్వేలో కరోనా కట్టడి చర్యలపై అధికారులతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా దృశ్యమాద్యమ సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం నుంచి సమావేశంలో పాల్గొన్నారు. విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ విభాగాలకు చెందిన ఆరు డివిజన్ల రైల్వే మేనేజర్లు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కొవిడ్-19 వ్యాపించకుండా... సంబంధిత మార్గదర్శకాలను కచ్చితంగా అమలుచేయడంపై ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులందరినీ ఆదేశించారు. స్టేషన్ పరిసరాలలో, రైళ్లలో క్రమంగా శానిటైజేషన్ నిర్వహణపై దృష్టి సారించాలని సూచించారు. ప్రయాణికులు సరిగ్గా మాస్కు ధరించేలా, క్రమంగా చేతులు శుభ్రపరుచుకునేలా వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. క్రూ బుకింగ్ లాబీ, వర్క్‌షాపు, ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లు తదితర ప్రాంతాల్లో శానిటైజర్లు ఏర్పాటు చేయాలన్నారు. స్టేషన్ పరిసరాల్లోను, కార్యాలయాల్లో అవసరం లేని వ్యక్తులు ప్రవేశించకుండా నోటీసు పెట్టాలని ఆదేశించారు. రైల్వే ఆసుపత్రి వద్ద అందుబాటులో ఉన్న వసతులు, వైద్య సదుపాయాలపై చర్చించారు. బుకింగ్, టికెట్ తనిఖీ సిబ్బంది, లోకో పైలట్లు, గార్డు, ఆర్‌పీఎఫ్ తదితర ఫ్రంట్‌లైన్ సిబ్బందికి వేగవంతంగా వ్యాక్సినేషన్ ఇవ్వాలన్నారు.
ఇదీ చూడండి: బార్లు, పబ్‌లు, జిమ్‌లు, థియేటర్లపై ఆంక్షలేవి?: హైకోర్టు