Sonia Gandhi birthday celebrations in Telangana : ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) జన్మదిన వేడుకలను హైదరాబాద్ గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, మంత్రులు, పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా 78 కిలోల కేక్‌ను పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావుతో రేవంత్‌రెడ్డి కేట్ కట్ చేయించారు.
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి, ప్రభుత్వ ఏర్పాటును కానుకగా ఇచ్చిన ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అంకితమని పేర్కొన్నారు. గాంధీభవన్ సాక్షిగా హస్తం సిద్దాంతాలు, ఆరు గ్యారెంటీలను (Congress Six Guarantees) తూచ తప్పకుండా అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ ప్రజల కోసమే పనిచేస్తుందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
సీఎం హోదాలో తొలిసారి దిల్లీకి రేవంత్ రెడ్డి - మల్కాజ్గిరి ఎంపీగా రాజీనామా
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మీ పథకాన్ని, నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. తద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర నారీమణులందరికీ సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు, తనకొక బాధ్యత ఇచ్చారని పేర్కొన్నారు. సేవకుడిగా ప్రజలందరీ ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత తనదేనని తెలిపారు. కార్యకర్తలకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని రేవంత్‌రెడ్డి వివరించారు.
"సోనియా గాంధీ జన్మదినం అంటే రాష్ట్ర ప్రజలకు పండుగ. ఉక్కు సంకల్పంతో 60 ఏళ్ల ఆకాంక్షను సోనియాగాంధీ సాకారం చేశారు. లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు సోనియా గాంధీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రజలకు పాలకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తాను." - రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించిన నేతలు : ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను, కరీంనగర్‌లో కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని 41 డివిజన్ నాయకులు దేవేందర్ ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌ఆర్ వాకర్స్‌తో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. హస్తం పార్టీ బలోపేతం కోసం ఆ భగవంతుడు ఆమెకు మరింత బలం చేకూర్చాలని నేతలు కోరుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐఎన్‌టీయూసీ కార్మిక సంఘం నాయకులు, కేటికే 1,5,6 సింగరేణి గనుల వద్ద కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు అందించడంలో హస్తం పార్టీ ముందుంటుందని తెలిపారు.
గాంధీభవన్‌లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
నేటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం - మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి