ప్రజల సమస్యలను గుర్తెరిగి వారి కష్టాలు తీర్చడం, తాగునీరు, పరిసరాల పరిశుభ్రత, రోడ్లు, డ్రైనేజీ తదితర సమస్యలను తీర్చడం తన బాధ్యతని సోమాజీగూడ కార్పొరేటర్ అత్తలూరి విజయలక్ష్మి అన్నారు. తొలిసారి శ్రీనగర్ కాలనీ కార్పొరేటర్‌గా తన శక్తికి మించి పనులు చేశానని ఆమె తెలిపారు. ఆ పనిచేసే తత్త్వమే తర్వాతి కాలంలో తాను తెరాస పార్టీలోకి మారినప్పటికీ అఖండ విజయాన్ని తెచ్చి పెట్టిందన్నారు. సోమాజీగూడ కార్పొరేటర్‌గా ఎన్నికై ప్రమాణస్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడ్దాయని... నాలుగైదు నెలల్లో క్రమంగా కోలుకుని అనారోగ్యాన్ని జయించానన్నారు.
పనులు చేయలేకపోయాను..
కార్పొరేటర్‌కు ప్రత్యేకంగా ఫండ్ లేకపోవడం, అధికారుల చుట్టూ తిరగలేకపోవడం, సమస్యలపై ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు సహకరించకపోవడం, ఆరోగ్యం కూడా పూర్తిస్థాయిలో సహకరించకపోవడం వల్ల చాలా పనులు చేయలేకపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రజలు అప్పగించిన బాధ్యతను గుర్తుంచుకుంటూనే చేపట్టాల్సిన పనులు పూర్తి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించానన్నారు. నిధుల లేమి కారణంగా కొన్ని పనులు ఇంకా అపరిష్కృతంగా మిగిలే ఉన్నాయన్నారు. ఇప్పడు మళ్లీ ఎన్నికలు వచ్చాయని... కార్పొరేటర్‌గా ఇచ్చిన హామీలను పూర్తి చేయలేకపోయినందున తిరిగి ప్రజలను ఓట్లు అడగడం నైతికంగా కరెక్ట్ కాదన్నారు.
మళ్లీ పోటీ చేయబోవడం లేదు..
అందుకే తాను మళ్లీ కార్పొరేటర్‌గా పోటీ చేయబోవడం లేదని అత్తలూరి విజయలక్ష్మి అన్నారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌లకు తన అభిప్రాయాన్ని తెలియజేశానన్నారు. సోమాజీగూడ అభ్యర్ధిగా పార్టీ ఎవరిని నిర్ణయించినా వారి విజయానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. డివిజన్లో పలు పనుల కోసం తనపై ఆశలు పెట్టుకున్న ఎందరికో క్షమాపణ చెబుతున్నానన్నారు. తనను గెలిపించిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: నూతన చట్టంతో.. వినియోగదారులకు మరింత బాసట..