ఇంజినీరింగ్ ప్రాంగణ నియామకాల్లో సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఈసారి భారీ మార్పులను తెచ్చాయి. ఇప్పటివరకు కోడింగ్‌కు ప్రాధాన్యమిచ్చిన కంపెనీలు ప్రస్తుతం రీజనింగ్ (తార్కికత), కమ్యూనికేషన్ (భావవ్యక్తీకరణ) నైపుణ్యాలపై దృష్టి చూపుతున్నాయి. గతంలో వీటిపైనా ప్రశ్నలున్నప్పటికీ కటాఫ్ మార్కుల్లో కోడింగ్‌కే ప్రాధాన్యమిచ్చేవారు. నాలుగేళ్ల కిందటి వరకు ఎంపిక పరీక్షల్లో రీజనింగ్, భావవ్యక్తీకరణ నైపుణ్యాలను ప్రధానంగా పరిశీలించేవారు. ఆ తర్వాత కోడింగ్‌ను పరిగణనలోకి తీసుకున్నారు.
తాజాగా మళ్లీ మార్పులను ప్రవేశపెట్టారు. ఆగస్టు 13 నుంచి ప్రాంగణ ఎంపికల పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియ మరో 25 రోజులపాటు కొనసాగనుంది. కొవిడ్-19 కారణంగా కళాశాలలు మూసి ఉన్నందున ఆయా కంపెనీలు వర్చువల్ విధానంలోనే ఎంపిక చేసుకుంటున్నాయి. ‘వెబ్‌కామ్ ప్రొక్టోరెడ్ అసెస్‌మెంట్ పరీక్ష’ కింద విద్యార్థులకు లింకును పంపిస్తున్నాయి. వాటి ద్వారా ఇళ్లనుంచే పరీక్షకు హాజరుకావొచ్చు.
టీసీఎస్ మాత్రం ఇంట్లోనే కాకుండా అయాన్ కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తోంది. గతంలో కొన్ని కంపెనీలు కళాశాలలకు వచ్చేవి. లేదా 3,4 కళాశాలలకు కలిపి ఒక చోట ఎంపికలను చేపట్టేవి. ఈసారి పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నాయి.
ఎంపిక విధానమిలా..
- ఎంపిక చేసిన కళాశాలల్లో జెన్-సీ పేరుతో కాగ్నిజెంట్ ఇప్పటికే పరీక్షను నిర్వహించింది. 129 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షకు 2 గంటల సమయమిచ్చింది. ఇందులో 70 మార్కులు కోడింగ్‌కు కేటాయించగా, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, ఎస్సే రైటింగ్‌కు 59 మార్కులను కేటాయించింది. వీటిల్లోనూ అర్హత సాధించాలనే నిబంధనను తెచ్చింది. అన్నింట్లోనూ ప్రతిభ చూపిన వారికి జెన్-సీ అడ్వాన్స్‌డ్ నిర్వహిస్తుంది.
- ముందస్తుగా ఒప్పందాలు చేసుకున్న కళాశాలలకు ఇన్ఫోసిస్ పరీక్షలను నిర్వహించింది. ఇందులో పజిల్స్‌ను కొత్తగా ఇవ్వడంతోపాటు వెర్బల్‌కు ప్రాధాన్యమిచ్చింది. పాత పద్ధతిలో ఎంపిక పరీక్షలకు సన్నద్ధమైనవారు కష్టపడాల్సి వచ్చింది.
- ఎంపిక చేసిన కళాశాలల్లో విప్రో టాలెంట్ నెక్స్ట్ నిర్వహించనుంది. తర్వాత ఎంపిక పరీక్ష చేపడుతుంది.
మారిన టీసీఎస్ పరీక్ష పద్ధతి
టీసీఎస్ ఇప్పటికే కోడింగ్ పరీక్షను పూర్తి చేసింది. నింజా స్థానంలో టీసీఎస్ ఈసారి అయాన్ జాతీయ అర్హత పరీక్షను చేపడుతోంది. లోగడ 90 నిమిషాలున్న సమయాన్ని ఈసారి 180 నిమిషాలకు పెంచింది. ఇందులో కోడింగ్‌పై 2 ప్రశ్నలు ఉండగా వెర్బల్, రీజనింగ్, న్యూమెరికల్ ఎబిలిటీ, ప్రోగ్రామింగ్ లాజిక్ నుంచి 90 ప్రశ్నలు ఇవ్వనుంది. సమయంలోనూ రీజనింగ్‌కు 50నిమిషాలు ఇవ్వగా, న్యూమెరికల్ ఆబిలిటీకి 40నిమిషాలు ఇస్తోంది. ఈ జాతీయ అర్హత పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కులను తమతో అంగీకారమున్న ఇతర కార్పొరేట్ కంపెనీలకు టీసీఎస్ ఇవ్వనుంది.
కళాశాలలు సన్నద్ధం కావాలి
సాఫ్ట్‌వేర్ కంపెనీల ఎంపిక విధానాలు మారుతున్నాయి. మార్పులకు అనుగుణంగా కళాశాలలు విద్యార్థులకు శిక్షణనివ్వాలి. నూతన పరీక్ష విధానాలపై నైపుణ్యాలను పెంచాలి. మాదిరి పరీక్షల ప్రాక్టీస్‌ను కొనసాగిస్తూ విద్యార్థులు సన్నద్ధమవ్వాలి.- కోట సాయికృష్ణ, గౌరవాధ్యక్షుడు, ఏపీ శిక్షణ ఉపాధి అధికారుల సమాఖ్య