Locals Clash With Panchayat Staff : ఆంధ్రప్రదేశ్లోని వైయస్సార్ కడప జిల్లాలో పందులు పట్టుకునే విషయమై పంచాయతీ సిబ్బంది, స్థానికులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఓ వాహనం ధ్వంసమైంది. కాగా డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారమందుకున్న పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి సద్దుమణిగింది. పందులు ఉన్న వాహనాన్ని ఠాణాకు తరలించారు. అసలు అక్కడ ఏమైందంటే.
పందుల బెడదపై ఫిర్యాదులు : కడప జిల్లాలోని జమ్మలమడుగులో గత కొన్ని రోజులుగా స్థానికులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ క్రమంలో నగర పంచాయతీ కమిషనర్ వెంకటరామిరెడ్డికి పట్టణ శుభ్రతపై కొన్ని కంప్లైంట్లు వచ్చాయి. దీంతో నగర పంచాయతీ సిబ్బంది పట్టణంలో క్లీనింగ్ పనులను నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. అయితే అక్కడే కొంత మంది స్థానికులు పందులను పెంచుకుంటున్నారు. ఆ పందులు పట్టణంలో సంచరించడం వల్ల రోగాలు ఎక్కువ అవుతున్నాయి. దీనిపై కూడా ఫిర్యాదులు అందాయి.
దీంతో నగర కమిషనర్ వెంకటరామిరెడ్డి ఆ పందుల యజమానులకు వాటిని పట్టణంలోకి వదలకూడదని నోటీసులు ఇచ్చారు. అవసరం అయితే పందులు పెంచుకునేందుకు ఊరి చివరన తగిన ఏర్పాట్లు కూడా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ పందుల యజమానులు ఆయన మాటలను పట్టించుకోలేదు. దీంతో కమిషనర్ వారికి రెండు సార్లు నోటీసులను జారీ చేశారు. అయినా వారు పట్టించుకోకుండా పందులను అలానే పట్టణంలోనికి వదులుతున్నారు.
వాహనాలకు నిప్పంటించిన పందుల యజమానులు : దీంతో నగర పంచాయతీ సిబ్బంది రంగంలోకి దిగి పోలీసుల ఆధ్వర్యంలో పందులను పట్టుకునే ప్రక్రియను చేపట్టారు. పట్టణంలో తిరుగుతున్న పందులను పట్టుకుని వాహనంలో ఎక్కించారు. ఈ పందులను తరలించే క్రమంలో పందుల యజమానులు వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో నగర పంచాయతీ సిబ్బంది, పోలీసులతో వారికి వాగ్వాదం జరిగింది.
దీంతో రెచ్చిపోయిన పందుల యజమానులు వాహనంపై రాళ్లతో దాడి చేసి అద్దాలను పగలకొట్టారు. అంతటితో ఆగకుండా వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో వాహనం ధ్వంసం కాగా డ్రైవర్ గాయపడ్డాడు. పరిస్థితి అదుపు తప్పడంతో సీఐ గోపాల్ రెడ్డి, ఎస్సై రామకృష్ణ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పందుల యజమానులను చెదరగొట్టి ఆ వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు.