తల్లికడుపు నుంచి పెద్ద యుద్ధమే చేసి.... భూమిపైకి వస్తుంది పసికందు. ధరణిపై అడుగుపెట్టగానే అనేక రకాల ఆరోగ్య సమస్యలు పసికందులను ముసురుకుంటాయి. అలాంటి వారిని కాపాడేందుకు ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నవే నవజాత శిశు సంరక్షణా కేంద్రాలు. ఐసీయూ సేవలు, శస్త్రచికిత్సలు మినహా పుట్టిన బిడ్డను కాపాడేందుకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ఎస్ఎన్సీయూల్లో అందుబాటులో ఉంటాయి.
దేశంలో నవజాత శిశు మరణాల రేటు 22 శాతం ఉండగా.. తెలంగాణలో 19గా ఉంది. 2016లో 31,720 మందికి ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స అందించగా... 2,780 మంది చిన్నారులు మృతి చెందినట్టు ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అంటే 8.8 శాతం మరణాలు నమోదయ్యాయి. ఇక 2017లో చిన్నారుల మరణాల రేటు 7.0 ఉండగా... 2018, 2019లో 6 శాతానికి తగ్గింది. 2019, 2020లో 35,324 మందికి చికిత్స అందంచగా.. 1,910 మంది చిన్నారులు మృతిచెందారు. మరణాల రేటు 5.4శాతం నమోదైంది. ఇక 2020 జనవరి నుంచి అక్టోబర్ చివరి నాటికి 27,002 మంది చిన్నారులకు రాష్ట్రంలో ఎస్ఎన్సీయూ సేవలు అందించినట్టు అధికారులు చెబుతున్నారు.
49కి చేరిన కేంద్రాలు
ఏటా పుట్టిన శిశువుల్లో 15 శాతం మంది నవజాత శిశువులకు ఎస్ఎన్సీయూ సేవలు అవసరమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 18 నవజాత శిశు సంరక్షణా కేంద్రాలు మాత్రమే ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్యను 42కి పెంచింది సర్కారు. వాటిలో ఇప్పటికే 29కేంద్రాలు అందుబాటులోకి రాగా... మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి. ఏటా సుమారు 6 లక్షల యాభై వేల మంది శిశువులు జన్మిస్తుండగా... వారిలో 3 లక్షల మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జన్మిస్తున్నారు. వీరిలో 45 వేల మందికి ఎస్ఎన్సీయూ సేవలు అవసరమవుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 29కేంద్రాల్లో 560 పడకలు నవజాత శిశువుల కోసం అందుబాటులో ఉండగా... నిర్మాణంలో ఉన్న మరో 13కేంద్రాల్లో 220 పడకలను ఏర్పాటు చేస్తున్నారు.
జిల్లాకో కేంద్రం
కొత్త జిల్లాల ప్రాతిపదికన.. ప్రతి జిల్లాకో కేంద్రం ఏర్పాటు చేసేలా ప్రణాళిక చేస్తున్నారు. మరోవైపు ఇటీవలే రాష్ట్రానికి నాలుగు మథర్ మిల్క్ బ్యాంకులను ఏర్పాటు చేసేందుకు అనుమతులు లభించాయి. వీటితోపాటు ఇప్పటికే 46 న్యూ బోర్న్ స్టేబులైజేషన్ యూనిట్లు, 562 న్యూ బోర్న్ బేబీ కార్నర్ల ద్వారా నవజాత శిశువులకు కావాల్సిన సేవలను అందిస్తోంది.
శిశు సంరక్షణలో ఏటా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నప్పటికీ.... మరణాల రేటును మరింతగా తగ్గించాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. అన్ని ప్రసూతి కేంద్రాల్లోని చిన్నారులకు తల్లిపాలు అందేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్టు చెబుతున్నారు.
ఇదీ చూడండి: నగర శివార్లలో భారీ టౌన్‌షిప్‌ల నిర్మాణం..