శంషాబాద్ విమానాశ్రయంలో ఏప్రిల్ 1 నుంచి మే 5 వరకు అంటే కేవలం 35 రోజుల్లోనే 16 స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 3 కోట్ల 20 లక్షల విలువైన 10.16 కిలోల బంగారం, 4 కోట్ల 4 లక్షలు విలువ చేసే 40 వేల 400 విదేశీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. 2018-19 ఆర్థిక ఏడాదిలో వివిధ రకాల వస్తువుల స్మగ్లింగ్‌కు పాల్పడిన వారిపై మొత్తం 163 కేసులు నమోదు చేశారు. ఇందులో 24 మంది స్వదేశీ, ఇద్దరు విదేశీయులను అరెస్టు చేశారు. వీరి నుంచి 17 కోట్ల 44 లక్షల విలువైన బంగారం, సిగరెట్లు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇలా వివిధ వస్తువులు స్మగ్లింగ్ చేస్తూ... అక్రమార్కులు కస్టమ్స్ అధికారులకు దొరికిపోతున్నారు.
బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు ఎప్పటికప్పుడు... కొత్త తరహా విధానాలను అనుసరిస్తూ అధికారుల ఎత్తులను చిత్తు చేస్తున్నారు. బంగారం రూపాన్నే మార్చేసి.. పొడిగా, గడ్డగా, బిస్కెట్లుగా, ఘనపదార్థంగా రకరకాలుగా దాచి హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. ముందస్తు సమాచారంతో నిఘా పెడితే తప్ప అధికారులు పట్టుకోలేని విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇటీవల కాలంలో బంగారం ధర పెరిగినందున స్మగ్లింగ్ కూడా పెరిగింది. ప్రధానంగా గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులను క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. వ్యక్తుల నడవడికిలో తేడాను గమనించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒకసారి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన వారిని రెడ్ మార్క్ చేసి పక్కన పెడుతున్నట్లు చెబుతున్నారు.
అక్రమ రవాణాను నిలువరించేందుకు... విదేశాలకు వెళ్లే వారికి అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కస్టమ్స్ రవాణా కమిషనర్ ఎం.ఆర్.ఆర్.రెడ్డి, అదనపు కమిషనర్ మంజుల రాణాలు తెలిపారు.
ఇవీ చూడండి: పనామా చోరీ రాంజీ గ్యాంగ్ పనేనా?