రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణ, వైద్య సౌకర్యాల కల్పనకు ఆరేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆరేళ్లలో ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకాలు మెరుగైన ఫలితాలను సాధించాయని ప్రభుత్వం పేర్కొంది. పది పడకల 20 ఐసీయూలు, రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో ఐసీయూ సదుపాయాలు సమకూర్చినట్లు వివరించింది. నవజాత శిశువులకు అత్యవసర సేవల కోసం గతంలో ఉన్న ఎస్ఎన్సీయూలను 42కి పెంచింది. గర్భిణీలు, బాలింతల కోసం ప్రత్యేకంగా మెటర్నల్ ఐసీయూలను ఏర్పాటు చేసినట్లు సర్కారు పేర్కొంది.
కోటి మందికిపైగా కంటి పరీక్షలు..
కంటి వెలుగు పేరుతో కొత్త పథకానికి రూపకల్పన చేసిన తెలంగాణ సర్కారు.. రాష్ట్ర వ్యాప్తంగా కోటీ 54 లక్షల మందికి పైగా కంటి పరీక్షలు జరిపి.. 41 లక్షల మందికి కంటి అద్దాలు, మందులు ఉచితంగా సరఫరా చేసింది. వ్యాధుల నిర్ధరణ కోసం ఉచితంగా 58 రకాల పరీక్షలు నిర్వహించేందుకు... ప్రతి జిల్లా కేంద్ర దవాఖానాలో డయాగ్నస్టిక్ హబ్‌లు నెలకొల్పేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఐపీఎంలో మోడల్ హబ్‌ను ఏర్పాటు చేసి.. రక్త, మల, మూత్ర పరీక్షలు, టైఫాయిడ్, డెంగీ, మలేరియా జ్వరాల నిర్ధారణ, కాలేయం, మూత్ర పిండాలు, థైరాయిడ్ పనితీరు, కొలెస్ట్రాల్, మధుమేహం వంటి వాటితో పాటు మొత్తం 58 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు చెందిన గర్భిణీలకు సేవలందించేందకు... ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద 102 వాహన సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది.
ప్రసవానంతరం ఇంటికి..
గర్భిణీలను ఇంటి నుంచి ప్రభుత్వ దవాఖానకు... ప్రసవానంతరం దవాఖాన నుంచి ఇంటికి సురక్షితంగా తరలించడానికి... 102 వాహనాలు అపూర్వమైన సేవలు అందిస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. చిన్న చిన్న రుగ్మతలతో బాధపడే వృద్ధులు, మహిళలకు వైద్యసేవలతోపాటు నెలకు సరిపడా మందులను 104 వాహనాల ద్వారా అందిస్తున్నారు.
ఇదీ చూడండి : పొగాకు రహిత రాష్ట్రంగా తెలంగాణ: ఈటల