sit investigation in data theft case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. డేటా చోరీ కేసులో మొట్టమొదట డేటా లీక్ చేసిందెవరనే కోణంలో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి వినియోగదారుల డేటా చేతులు మారినట్లు ప్రాథమికంగా గుర్తించారు. గూగుల్ క్లౌడ్ లో వినియోగదారుల డేటా ఉన్నట్లు గుర్తించినప్పటికీ, దానిని మొదట అప్ లోడ్ చేసిందెవరనే విషయాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఒకరి నుంచి మరొకరి చేతులు మారి, ఇలా చాలా మంది చేతుల్లోకి వ్యక్తిగత డేటా వెళ్లినట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.
33 కంపెనీలకు నోటీసులు: కేసుకు సంబంధించి ఇప్పటివరకు 33 కంపెనీలకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీచేయగా.. 24 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. పలు కంపెనీల ఖాతాదారుల డేటా లీక్ అయినట్లు పోలీసులు నిర్ధరించారు. మరో 9 సంస్థల వివరాలు సేకరించాల్సి ఉంది. 24 సంస్థల్లో పలు సంస్థలు తమ వినియోగదారుల డేటా లీక్ అయినట్లు ఒప్పుకున్నాయి. మరికొన్ని సంస్థలేమో వినియోగదారుల వివరాలున్నప్పటికీ... కంపెనీలో ఉన్న విధంగా కాకుండా మరో విధానంలో ఉన్నాయని, ఎవరూ లీక్ చేశారో తెలియదని సైబరాబాద్ పోలీసులకు వివరణ ఇచ్చారు.
పలు కంపెనీల డేటా చోరీ: పలు బ్యాంకులు, ఈ కామర్స్ వెబ్ సైట్లు, ఆన్ లైన్ శిక్షణా తరగతులకు చెందిన డేటా లీకైనట్లు గుర్తించారు. దాదాపు 68కోట్ల మంది డేటా బయటికి వెళ్లింది. ఇందులో క్రెడిట్, డెబిట్ కార్డుల సమాచారం కూడా ఉండటం గమనార్హం. డెబిట్, క్రెడిట్ కార్డుల సమాచారం బయటికి వెళ్లడం వల్ల సైబర్ నేరాలు చోటు చేసుకుంటున్నట్లు తేలింది. బిగ్ బాస్కెట్లో అయితే వినియోగదారుల డేటా సేకరించి, బహుమతులు, కూపన్ల పేరుతో మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. డేటా లీక్ చేసిన కేసులో వినయ్ భరద్వాజ్‌తో పాటు మొత్తం 19మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. డేటాను మొదట లీక్ చేసిన వారిని కనిపెట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటి వరకు 19మంది అరెస్ట్: డేటా చోరీ కేసులో ఇప్పటి వరకు 19మందిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎవరనేది తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని సిట్ అధికారులు తెలిపారు. గూగుల్ క్లౌడ్‌లో వినియోగదారుల వ్యక్తిగత వివరాలు పెట్టి విక్రయాలు చేస్తున్నారని.. వివరాలు పెట్టిన వాళ్ల గురించి సమాచారం ఇవ్వాలని గూగుల్‌కు లేఖ రాసినట్లు వివరించారు. గూగుల్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగుతుందని.. అందుకే ఈ కేసులో దర్యాప్తు కాస్త ఆలస్యమవుతుందని ఇదివరకే పోలీసులు తెలిపారు.
కోట్ల మంది ఖాతాదారుల డేటా చోరీ: పలు ప్రముఖ సంస్థల ఖాతాదారుల డేటా చోరి జరిగిందని అధికారులు వెల్లడించారు. బిగ్ బాస్కెట్‌కు చెందిన మూడు కోట్ల మంది ఖాతాదారుల డేటా చోరీకి గురైందని.. ఈ విషయాన్ని బిగ్ బాస్కెట్ ప్రతినిధులు సైతం ఒప్పుకున్నారని సిట్ అధికారులు తెలిపారు. అయితే గతేడాదే పాలసీబజార్ వినియోగదారుల వివరాలు బయటకెళ్లిన విషయాన్ని సంస్థ ప్రతినిధులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారని సిట్ అధికారులు తెలిపారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారుల 7.5 జీబీ డేటా బయటికి వెళ్లినట్లు అధికారులు గుర్తించినప్పటికీ ఈ విషయంలో మాత్రం వారు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలిపారు.
ఇవీ చదవండి: