SIT Investigation in TSPSC Paper Leak Case: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పని చేస్తూ.. తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన చందంగా లక్షలాది మంది జీవితాలను తలకిందులు చేసేందుకు ప్రయత్నించి, అడ్డంగా దొరికిపోయిన టీఎస్పీఎస్సీ ఇంటి దొంగలు అతి తెలివి ప్రదర్శించారు. పరీక్షకు ముందే ప్రశ్నలన్నీ ముందే తెలిస్తే.. బట్టీ పట్టి మరీ అన్నింటికి జవాబులు పెడుతుంటారు. కానీ గ్రూప్-1 పరీక్షలో ప్రశ్నాపత్రం ముందుగానే చేజిక్కించుకున్న ఇంటి దొంగలు మాత్రం ఇక్కడే తమ తెలివితేటలు ప్రదర్శించారు.
అత్యధిక మార్కులు సాధిస్తే అందరి కళ్లూ తమపైనే పడి అసలుకే ఎసరు వస్తుందని భావించారు. టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న 20 మందిలో 8 మంది గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించారు. వీరిలో షమీమ్, సురేష్, రమేశ్‌కు వందకుపైగా మార్కులు రాగా.. షమీమ్ అత్యధికంగా 127 మార్కులు తెచ్చుకుంది. ఈ ముగ్గురూ ప్రవీణ్, రాజశేఖర్ ద్వారా ముందుగానే ప్రశ్నాపత్రం పొంది, పరీక్ష రాసినట్లు పోలీసులు గుర్తించారు.
అనుమానం రాకుండా కావాలనే: వీరు అనుకుంటే 150కి 150 మార్కులూ తెచ్చుకోగలరు. టీఎస్పీఎస్సీ నిబంధనల ప్రకారం ఎవరికైనా ఆశ్చర్యకరమైన స్థాయిలో మార్కులు వస్తే.. వారిపై అంతర్గత విచారణతో పాటు అవసరమైతే పోలీసులతోనూ దర్యాప్తు జరిపిస్తుంటారు. టీఎస్పీఎస్సీలో పని చేస్తూ కమిషన్ అనుమతితో పరీక్షలు రాసిన ఈ ముగ్గురికీ ఈ విషయం తెలిసినందున.. అనుమానం రాకుండా కావాలనే ఆ మాత్రమైనా తక్కువ మార్కులు తెచ్చుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు 103 మార్కులు: మరోవైపు ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చాయి. ఓఎంఆర్ షీట్‌లో వ్యక్తిగత వివరాలు నింపే క్రమంలో డబుల్ బబ్లింగ్ చేసి, అనర్హుడవ్వటం అనేక అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా పరీక్ష మొదలు కాకముందే ఓఎంఆర్‌లో అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు నింపాకే.. ఇన్విజిలేటర్ సంతకం చేస్తుంటారు. ఎవరైనా తప్పులు చేసినట్లైతే దానిని వెనక్కి తీసుకుని, మరో ఓఎంఆర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రవీణ్ ముందే డబుల్ బబ్లింగ్ చేసి ఉంటే ఇన్విజిలేటర్ గుర్తించేవారు. కానీ తనపై అనుమానం వచ్చే అవకాశం ఉందని భావించే.. పరీక్ష చివరలో డబుల్ బబ్లింగ్ చేసి, ఉత్తీర్ణుడు కాకుండా జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది.
పోలీసులను నమ్మించే ప్రయత్నం: ప్రశ్నాపత్రం లీకేజీ ముందు నుంచీ నిందితులు ఇదే తరహాలో జాగ్రత్త పడుతూ వచ్చారు. టౌన్ ప్లానింగ్ ప్రశ్నపత్రం లీక్ అయినట్లు గుర్తించగానే.. ప్రవీణ్, రేణుకలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము ఏఈ ప్రశ్నాపత్రం మాత్రమే లీక్ చేశామని నమ్మించేందుకు ప్రయత్నించారు. అంతటితోనే విచారణ ఆగిపోతుందని భావించినా.. లీకేజీ వ్యవహారం రేపిన చిచ్చుతో పోలీసులు తవ్వేకొద్దీ డొంక కదిలినట్లుగా గ్రూప్-1 సహా 4 పరీక్షా పత్రాలు లీక్ అయినట్లు బయటపడింది.
విచారణ సమయంలోనూ నిందితులు పోలీసులను పక్కదోవ పట్టించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ఎంతో ప్రశ్నించినా ప్రవీణ్ నోరు మెదపకపోగా,.. రాజశేఖర్ అయితే తనకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎలా వచ్చాయన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. శంకరలక్ష్మి డైరీ నుంచి వివరాలు కొట్టేసినట్లు దర్యాప్తులో పోలీసులే తెలుసుకున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని తలపిస్తోన్న టీఎస్పీఎస్సీ సిరీస్‌లో సిట్ తీగలాగే కొద్దీ.. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.
ఇవీ చదవండి: TSPSC లీకేజీ వ్యవహారం.. ప్రశ్నాపత్రాలు ఇంకెన్ని చేతులు మారాయి?