SIT Inquiry in TSPSC Paper Leakage Issue : టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ను సిట్‌కు నేతృత్వం వహిస్తున్న ఏఆర్ శ్రీనివాస్ స్వయంగా విచారించారు. పరీక్షల నిర్వహణ, కాన్ఫిడెన్షియల్ విభాగం.. రెండూ కార్యదర్శి ఆధ్వర్యంలోనే పని చేస్తాయి. కాన్ఫిడెన్షియల్ విభాగానికి ఇన్‌ఛార్జీగా ఉన్న శంకరలక్ష్మి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ కొట్టేసిన ప్రవీణ్.. ప్రశ్నపత్రాలను దొంగిలించాడు.
ఒప్పంద ఉద్యోగ నియామకాలపై ఆరా : టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌కు వ్యక్తిగత సహాయకుడిగా ప్రవీణ్ వ్యవహరిస్తున్నాడు. ఈ మొత్తం వ్యవహారంలో కార్యదర్శి పాత్ర కీలకంగా మారింది. ప్రవీణ్ గ్రూప్-1 పరీక్ష రాస్తున్నప్పటికీ సెలవుపై ఎందుకు పంపలేదని అడిగారు. అతడికి 100కు పైగా మార్కులు వచ్చినా.. అనుమానం రాకపోవడానికి కారణాలు ఏంటని అనితా రామచంద్రన్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రశ్నపత్రాల లీకేజీలో కీలక నిందితుడు రాజశేఖర్‌రెడ్డి, లీకైన ప్రశ్నపత్రంతో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన సురేశ్ ఇద్దరూ టీఎస్పీఎస్సీలో ఒప్పంద ఉద్యోగులే. ఒప్పంద ఉద్యోగుల నియామకం, ఎంపిక ప్రక్రియపై... అనితా రామచంద్రన్ నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం.
ఎవరి ఆధీనంలో ప్రశ్నపత్రాలు, జవాబులు, 'కీ' : పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, జవాబులకు సంబంధించిన 'కీ' ఎలా, ఎవరి ఆధీనంలో ఉంటాయని అడిగి ఆమె వాంగ్మూలం నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది. పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు, సమాధానాలు, కీ... ఛైర్మన్ ఆధీనంలో ఉంటాయని అనితా రామచంద్రన్ చెప్పినట్టు సమాచారం. ఛైర్మన్ కంప్యూటర్‌లోనే ఇవన్నీ ఉంటాయని వివరించినట్టుగా తెలుస్తోంది. దీనిలో బోర్డు సభ్యుల ప్రమేయం ఉండదని... సిట్ అధికారులకు చెప్పినట్టు సమాచారం. అవసరమైతే మరోమారు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అనితా రామచంద్రన్‌కు సిట్ అధికారులు చెప్పినట్లు సమాచారం.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు లింగారెడ్డిని కూడా సిట్ అధికారులు దాదాపు రెండు గంటల పాటు ప్రశ్నించారు. లింగారెడ్డి సహాయకుడిగా పని చేసిన రమేశ్‌కు గ్రూప్-1 ప్రశ్నపత్రం అందింది. ప్రవీణ్ ద్వారానే పేపర్ అందినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రమేష్ ఎప్పటి నుంచి సహాయకుడిగా పని చేస్తున్నాడని లింగారెడ్డిని ప్రశ్నించారు. రమేష్ వ్యవహారశైలి, అతడి ఆర్థిక పరిస్థితులపై ఆరా తీశారు. రమేష్ గ్రూప్-1 పరీక్ష రాసిన విషయం తనకు తెలియదంటూ లింగారెడ్డి సిట్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టం చేసినట్టు సమాచారం. విచారణలో భాగంగా లింగారెడ్డి ఎదురుగానే రమేశ్‌ను ఉంచారు. అతడు తన పీఏనే అని లింగారెడ్డి సిట్ అధికారులకు ధ్రువీకరించినట్టు తెలిసింది.
రేణుక బెయిల్ పిటిషన్ తిరస్కరణ : టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితురాలు రేణుక రాఠోడ్ బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. తన ఆరోగ్యం సరిగా లేదని, ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకోవాలని ఆమె బెయిల్ కోరారు. దర్యాప్తు కీలక దశలో ఉందని.. రేణుక బయటకు వస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని సిట్ వాదించింది. దీంతో న్యాయస్థానం రేణుక బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.
ఇవీ చదవండి: