హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆ సంస్థ సీఎండీ శ్రీధర్ దృశ్యమాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. గత నెలలో ఉత్పత్తి, ప్రస్తుత మాసంలో సాధించాల్సిన లక్ష్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 9.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో 15.57 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగినట్లు శ్రీధర్ పేర్కొన్నారు. తద్వారా దాదాపు 64 శాతం వృద్ధి నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇదే స్ఫూర్తిని రెండో త్రైమాసికంలోనూ కొనసాగించాలని అధికారులకు సూచించారు.
వర్షాకాలంలో ఉత్పత్తికి కొంత విఘాతం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి గనిలోనూ పంపుల ద్వారా వర్షం నీటిని తరలించే ఏర్పాట్లు చేసుకోవాలని సీఎండీ స్పష్టం చేశారు. ప్రతి షిఫ్టులోనూ ఉత్పత్తి కోసం ప్రత్యేక ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు. ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను చేరుకోవడానికి ఏరియా స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకోవాలన్నారు. ఏమైనా అవసరాలు, సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని.. పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
పనులను త్వరగా పూర్తి చేయాలి..
సింగరేణి ఒడిశాలో చేపట్టిన నైనీ ప్రాజెక్టులో ఈ ఏడాదిలో బొగ్గు ఉత్పత్తి మొదలవడానికి తీసుకోవాల్సిన పనులను త్వరగా పూర్తి చేయాలని శ్రీధర్ ఆదేశించారు. ఆర్‌జీ-1 ఏరియాలో ఓసీపీ-5 ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. సమావేశంలో ప్రతి ఏరియాలోని నూతన ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన భూ సేకరణ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన వివిధ అనుమతుల పురోగతిపై సమీక్షించి, వాటికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు.
హరితహారంతో మంచి ఫలితాలు..
ఏడో విడత హరితహారాన్ని సింగరేణిలో విజయవంతం చేయాలని డైరెక్టర్లు, ఏరియా జీఎంలకు సూచించారు. ఈ ఏడాది సింగరేణి వ్యాప్తంగా 50 లక్షల మొక్కలు నాటాలని నిర్దేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులను, జిల్లా కలెక్టర్లను సమన్వయపర‌్చుకుంటూ కార్యక్రమాలను రూపొందించుకోవాలన్నారు. గత ఆరేళ్లలో సింగరేణి వ్యాప్తంగా చేపట్టిన హరితహారం మంచి ఫలితాలను ఇచ్చిందని గుర్తు చేశారు.
సింగరేణిలో కరోనా తగ్గుముఖం..
గత నెలలో దేశం, రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగినప్పటికీ.. సింగరేణిలో మాత్రం కేసులు తగ్గుముఖం పట్టాయని శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. అధికారుల సరైన నిర్ణయాల వల్లే వైరస్‌కు అడ్డుకట్ట వేయగలిగామని తెలిపారు. ప్రస్తుతం సింగరేణిలో 150 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 38,500 మందికి వ్యాక్సినేషన్ వేయించామని స్పష్టం చేశారు. త్వరలోనే మిగతా వారికి వ్యాక్సిన్ వేస్తామని అన్నారు.