kamadenu goshala in hyderabad : హిందూ సంస్కృతి, సంప్రదాయాల్లో గోవుకు విశిష్ట స్థానం ఉంది. వృద్ధాప్యం, అనారోగ్యం, గాయాల పాలై క్షీణ దశలో ఉన్న గోవులను సంరక్షిస్తూ గో సేవలో నిమగ్నమైన కామధేను గోశాల విశేష సేవలందిస్తోంది. హైదరాబాద్‌లో శ్రీ సద్గురు సమర్థ నారాయణ ఆశ్రమం నిర్వాహకులు ప్రభుదత్త మహరాజ్ నేతృత్వంలో.. ఆరోగ్యవంతంగా తీర్చిదిద్ధిన గోవులను సేద్యానికి ఉపయోగించుకునేందుకు పేద రైతులు ఒక్కొక్కరికీ జోడు ఎద్దులు అందిస్తున్నారు. పురానపూల్ సమీపంలో 6 ఎకరాల విస్తీర్ణంలో కొలువు దీరిన ఈ శ్రీ సమర్థ కామధేను హైటెక్ గోశాలలో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు శాస్త్రీయంగా గోవుల సంరక్షణ కార్యకలాపాలు విస్తృతంగా సాగుతున్నాయి. అసౌకర్యంగా ఉండకూడదన్న ఉద్దేశంతో ఏకంగా నాలుగు బహుళ అంతస్తుల భవనాలు ఏర్పాటు చేశారు. గోవులకు దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన ఎండు గడ్డి, పచ్చి మేతలు, సురక్షిత నీరు అందిస్తారు.
వివిధ ప్రాంతాల నుంచి: ప్రతికూల పరిస్థితుల్లోనూ నిత్యం ఈ గోశాలలో 70 మంది సిబ్బంది పని చేస్తుంటారు. మల, మూత్రాలు తొలగించి గోమాతలకు స్నానాలు చేయించి శుభ్రపరచడం రోజూ సాగే తంతు. కబేళాలకు తరలివెళ్లేవి, అలాగే వృద్ధాప్యం, అనారోగ్యం, పోషణ భారమైన ఆవులను చేరదీసి ఆలనా పాలనా చూస్తూ గోసేవలో నిమగ్నమై తరిస్తున్నారు. సందర్శకులు రోజు 75 నుంచి 100 వరకు వచ్చి క్షేత్ర దర్శనం చేసుకుంటూ గోవులకు పండ్లు, ఆహారం అందిస్తూ తన్మయత్వానికి లోనవుతున్నారు. హైదరాబాద్ నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు, గో ప్రేమికులు శ్రీ సమర్థ కామధేను గోశాలను సందర్శిస్తుంటారు. తాజాగా బయోప్యాక్ ఇన్‌పుట్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చి ఏటా ఆవులకు అవసరమైన ప్రొబయోటిక్స్ ఫుడ్ అందిస్తామని ప్రకటించింది.
400 ఏళ్ల చరిత్ర : 400 ఏళ్ల చరిత్ర గల ఈ గోశాల.. 350 గోవులతో మొదలై ప్రస్తుతం 7 వేలకు చేరింది. ప్రతి రోజు సుమారు రూ.3 లక్షలతో 70 టన్నుల గ్రాసం మేపుతున్నారు. గో సేవ ప్రాధాన్యత దృష్ట్యా చనిపోయే దశలో ఉన్న అత్యవసర పరిస్థితుల్లో కూడా వైద్యం, చికిత్సలు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ గోవులను ఆదరించి ప్రపంచం, పర్యావరణం సురక్షితంగా ఉంచాలని శ్రీ సద్గురు సమర్థ నారాయణ ఆశ్రమం అధిపతి ప్రభుదత్త మహరాజ్ పిలుపునిచ్చారు. గోవుల ప్రాధాన్యత దృష్ట్యా పారిశ్రామికవేత్తలు, సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఈ గోశాలకు సాయం అందించేందుకు ముందుకొస్తుండటం శుభపరిణామం.
ఇవీ చదవండి: