Sharmila complained to State Womens Commission: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించి తన పాదయాత్రను ఆపారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తంచేశారు. తనపై బీఅర్ఎస్ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై బుద్ధభవన్‌లోని మహిళా కమిషన్‌కు ఇవాళ ఫిర్యాదు చేశారు. ఒక మహిళగా ఉన్న తనపై బీఆర్ఎస్ నేతలు దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని పేర్లతో సహా మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు వై.ఎస్.షర్మిల వెల్లడించారు.
తనపై జరిగిన దాడి తెలంగాణ మహిళా సమాజంపై జరిగినట్లేనని ఆమె పేర్కొన్నారు. తాను రెచ్చగొట్టే మాటలు మాట్లాడలేదని స్పష్టం చేశారు. తమపై దాడులు చేసి దూషణలు చేసింది బీఆర్ఎస్ నేతలే అని పేర్కొన్నారు. మహిళా కమిషన్ ఛైర్మన్‌ను కలిసి ఫిర్యాదు చేసేందుకు అనుమతి కోరినా సమయం ఇవ్వలేదన్నారు. రెండు మూడు రోజుల నుంచి ప్రయత్నం చేసినా మహిళ కమిషనర్ అందుబాటులో లేరని అసహనం వ్యక్తంచేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ చర్యలు తీసుకోకపోతే జాతీయ మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తా అని అన్నారు.
రాష్ట్రంలో మహిళా కమిషన్ స్పందించలేదు కాబట్టే కౌశిక్ రెడ్డి విషయంలో జాతీయ మహిళా కమిషన్ స్పందించిందన్నారు. మహిళలపై దాడులు ఆగాలంటే తనపై ఆనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నేతలపై మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. పాదయాత్ర ఆపేసినందుకు కోర్టుకు వెళతానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
"మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో రక్షణ, గౌరవం లేదు. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలిగా మాత్రమే గాకుండా తెలంగాణ మహిళగా ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం వారి రక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టినా పూర్తి స్థాయిలో అమలు చేయడంలేదు. బీఆర్ఎస్ పార్టీలోని మహిళా నాయకులు ఎవరూ కూడా మహిళల రక్షణ గురించి మాట్లాడటం లేదు. నా ఫిర్యాదుపై రాష్ట్ర మహిళా కమిషన్ చర్యలు తీసుకోకపోతే జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తా" -వైఎస్ షర్మిల
ఇవీ చదవండి: