Singareni: సింగరేణిలో మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి ‘సమగ్ర ప్రాజెక్టు నివేదిక’( డీపీఆర్)కు సంస్థ పాలకమండలి శుక్రవారం ఆమోదం తెలిపింది. ఇకపై సింగరేణిలో 95 శాతం ఉద్యోగాలు స్థానిక జిల్లాల వారికే ఇవ్వాలని, మందమర్రిలో 50 వేల టన్నుల సామర్థ్యంతో పేలుడు పదార్థాల ప్లాంటు ఏర్పాటు తదితరాలపై హైదరాబాద్‌లో జరిగిన పాలకమండలి సమావేశం తీర్మానించింది. వ్యాపార విస్తరణలో భాగంగా ఇప్పటికే మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నెలకొల్పిన 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు ప్లాంటుకు అదనంగా అదే ప్రాంగణంలో మరో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంటు నిర్మిస్తారు. సుమారు రూ.6,790 కోట్ల అంచనా వ్యయంతో దీనికి డీపీఆర్ రూపొందించారు.
ఇప్పటి వరకు సింగరేణి విస్తరించిన 16 జిల్లాల వారికి అధికారేతర ఉద్యోగాల్లో 80, అధికారుల పోస్టుల్లో 60 శాతం స్థానిక రిజర్వేషన్ వర్తింపజేస్తుండగా ఇకపై 95 శాతానికి పెంచారు. త్వరలోనే దీనిపై ఉత్తర్వులు జారీ చేయనున్నారు. సింగరేణి ఉద్యోగులకు యూనిఫాం పంపిణీకి తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం ద్వారా రూ.2 కోట్ల వ్యయంతో నామినేషన్ పద్ధతిలో వస్త్రాలను కొనాలని నిర్ణయించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌తో కలిసి మందమర్రి వద్ద 50 వేల టన్నుల పేలుడు పదార్థాల ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే మణుగూరు, రామగుండం ఏరియాలలో ఉన్న 50 వేల టన్నుల ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష టన్నులకు పెంచాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ అధ్యక్షత వహించగా రాష్ట్ర ఆర్థిక, ఇంధన శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, సునీల్ శర్మ, కేంద్ర ప్రభుత్వ డైరెక్టర్లు మనోజ్ కుమార్, పీఎస్‌ఎల్ స్వామి, వి.కె.సోలంకి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పోలీసుల మార్గదర్శకాల మేరకే నిర్వహించాలి: హైకోర్టు