బర్డ్‌ఫ్లూతో రాష్ట్రానికి ఎలాంటి నష్టంలేదని అపోహలతో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. సచివాలయంలో బర్డ్ ఫ్లూపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అధికారులు, పౌల్ట్రీరంగ ప్రతినిధులతో మంత్రులు తలసాని, ఈటల రాజేందర్ భేటీ అయ్యారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలు, పొరుగు రాష్ట్రాల్లో పరిస్థితులపై సమీక్షించారు. దేశంలో అందరికంటే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని, సరిహద్దు జిల్లాలను అప్రమత్తం చేసినట్లు మంత్రి తలసాని చెప్పారు. బర్డ్ ఫ్లూతో ఇప్పటివరకూ ఎక్కడా మనుషులకు నష్టం జరగలేదన్న మంత్రులు... తప్పుడు ప్రచారాలతో తీవ్రనష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చికెన్, గుడ్లను ప్రజలు నిరభ్యంతరంగా తీసుకోవాలని తలసాని సూచించారు.
బర్డ్ ఫ్లూ మనుషులకు రాదని పలుమార్లు నిర్ధరణ అయిందన్న పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్రన్... బర్డ్ ఫ్లూ వ్యాధి నివారణకు వ్యాక్సిన్ ఉందని వివరించారు. ఎక్కువ సంఖ్యలో కోళ్లు చనిపోయిన ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు పరీక్షించారని, 276 నమూనాలు చెక్ చేసినా... ఎక్కడా పాజిటివ్ రాలేదన్నారు.
ఇదీ చూడండి: సచివాలయంలో బర్డ్ ఫ్లూపై ఉన్నతస్థాయి సమావేశం