Sejal lying unconscious on roadside jubileehills : గతంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై లైంగిక ఆరోపణలు చేసిన ఆరిజిన్ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్ ఇవాళ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి శేజల్‌ను ఆటోలో ఆసుపత్రికి తరలించారు. శేజల్ హ్యాండ్ బ్యాగులో నిద్రమాత్రలతో పాటు ఓ లేఖను గుర్తించిన పోలీసులు.. అందులో తనను లైంగికంగా వేధించిన దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని ఉన్నట్లు ఉంది.
దీనిపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు కూడా పేర్కొన్నారు. దిల్లీలో అధికార పార్టీకి చెందిన ఎంపీని కలిస్తే తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని లేఖలో ప్రస్తావించిన శేజల్.. ఇప్పుడేమో మొఖం చాటేశారని వాపోయింది. తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని లేఖలో పేర్కొంది. ఎమ్మెల్యే అనుచరులు ఎప్పుడు చంపుతారో అని భయంతో బతుకుతున్నానని లేఖలో ప్రస్తావించారు.
Bodapati Sejal committed suicide attempt : శేజల్ నిద్రమాత్రలు మింగినట్లు గుర్తించిన పోలీసులు.. ఆమెను వెంటనే ఆటోలో మాదాపూర్‌లోని పేస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శేజల్ ఆసుపత్రిలోని వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం గురించి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. గతంలోనూ దిల్లీలోని తెలంగాణ భవన్ ప్రాంగణంలో శేజల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
వెంటనే స్పందించిన తెలంగాణ భవన్ సిబ్బంది ఆమెను దగ్గరలోని ఆర్‌ఎంఎల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయంపై అప్పుడు దిల్లీలోని మహిళా కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ (HRC)ని కలిసి ఫిర్యాదు కూడా చేశారు. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆయన అనుచరులు తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు.
బాధితురాలకు న్యాయం జరగాలి: శేజల్ ఆరోగ్య పరిస్థితిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. మాదాపూర్‌లోని యువతి చికిత్స పొందుతున్న ఆసుపత్రికి ఆయన వెళ్లారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై డీజీపీతో మాట్లాడి.. బాధితురాలు తరుపున పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు శేజల్ ఆరోగ్య పరిస్థితిని కాంగ్రెస్ నేత కార్పొరేటర్ విజయ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఆమె చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్ అగ్రనాయకత్వం.. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు.
బోడపాటి శేజల్ VS దుర్గం చిన్నయ్య : ఆరిజిన్ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్ ఆదిలాబాద్‌లోని బెల్లంపల్లిలో తమ డెయిరీ స్థాపించేందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను గతంలో సాయం కోరినట్లు ఆమె అనేక సందర్భంలో ప్రస్తావించారు. ఆమె కోరినట్లుగానే ఎమ్మెల్యే సహాయంతో డెయిరీ ప్లాంట్ నిర్మించారు. ఆ తరువాత కంపెనీలో వాటా కావాలని ఎమ్మెల్యే కోరినట్లు ఆరోపణలు వచ్చాయి.
దీనికి ఆమె నిరాకరించగా.. తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని బోడపాటి శేజల్ పలుమార్లు ఆరోపించారు. ఈ వివాదంపై దుర్గం చిన్నయ్య సైతం స్పందించారు. తన రాజకీయ ఎదుగుదలను చూడలేక కొందరు ఒక మహిళను ఉపయోగించుకొని తనపై ఆరోపణలు చేస్తున్నారని వివరణ ఇచ్చారు. ఒక దళిత నాయకుడిగా తనకు లభిస్తున్న పేరు ప్రఖ్యాతలను చూసి ఓర్వలేక కొందరు ఇలా తప్పడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇవీ చదవండి: