Secunderabad Cantonment Board : హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో ఇక ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి. ప్రస్తుతం ఉన్న రోడ్లను విస్తరించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వానికి భూములు ఇచ్చేందుకు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆమోదం తెలిపింది. ఎన్‌హెచ్-44 ప్యారడైజ్-సుచిత్ర, ఎస్‌హెచ్-1 జింఖానా గ్రౌండ్ - హకీంపేట్ వరకు రోడ్డు విస్తరణకు 33 ఎకరాల భూమిని ఇచ్చే తీర్మానాన్ని ఆమోదించినట్లు బోర్డు సీఈవో మధుకర్ నాయక్ తెలిపారు. ఆర్మీ, ప్రైవేట్, బీ2 కలిపి మొత్తం 124 ఎకరాల కేటాయింపు విషయం ఆయా శాఖలు చూస్తాయని ఆయన పేర్కొన్నారు.
స్కైవేలు, మెట్రో కారిడార్, రహదారుల విస్తరణ కోసం రక్షణ శాఖకు చెందిన మొత్తం 157 ఎకరాల భూమిని ఇవ్వాలని గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ పరిధిలోని 33 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ వివరించారు. ఈ 33 ఎకరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.329 కోట్లను ఇస్తే.. కంటోన్మెంట్ పరిధిలో ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు (Secunderabad Cantonment Board) ఇచ్చిన భూముల్లో రోడ్డు విస్తరణ ద్వారా బోయిన్‌పల్లి, తిరుమలగిరి మార్గాల్లో ట్రాఫిక్ తగ్గనుంది.
రాజ్నాథ్సింగ్కు మంత్రి కేటీఆర్ లేఖ.. ఆ ఓట్లు తిరిగి చేర్చాలంటూ విజ్ఞప్తి
మరోవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియం వేగం పుంజుకుంటోంది. తాజాగా ముగిసిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా.. కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన సమయంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేసే అంశంపై కేంద్రం నుంచి శుభవార్త వచ్చిందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో విలీనం వ్యవహారం చర్చనీయాంశగా మారింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు రద్దు..
ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్లను స్థానిక సంస్థల్లో.. విలీనం చేసే ప్రక్రియ చేపట్టనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ ప్రాంతంలో రహదారుల విస్తరణ, పైవంతెనల నిర్మాణం, కొన్ని రహదారుల్లో ప్రజల రాకపోకల అంశాలపై తరచూ సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమే పౌర ప్రాంతాలను విలీనం చేసేందుకు ముందుకు రావటంతో.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సుముఖత వ్యక్తం చేస్తూ కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు లేఖ రాశారు.
ఇందులో భాగంగానే విలీనం ప్రక్రియ కార్యరూపంలోకి వచ్చాక రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రాంతాన్ని మిలటరీ స్టేషన్‌గా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కంటోన్మెంట్ బోర్డులో ప్రస్తుతం 4,000 మంది వరకు ఉద్యోగులున్నారు. వారిలో సుమారు 1,250 మంది శాశ్వత ఉద్యోగులు. విలీనం తర్వాత వీరంతా మిలటరీ స్టేషన్‌లోని వివిధ విభాగాల్లో చేరటం.. కేంద్ర ప్రభుత్వ శాఖలను ఎంచుకోవటం, స్వచ్ఛంద ఉద్యోగ విరమణ వంటి వెసులుబాటును కేంద్రం కల్పించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నట్లు సమాచారం.
జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనంపై కేంద్రం సానుకూల స్పందన.. కమిటీ ఏర్పాటు
ఒకేసారి 2లక్షల మంది నోట 'వందేమాతరం'.. ప్రపంచ రికార్డు దాసోహం.. ఎక్కడంటే?