Secunderabad Cantonment Board Election Schedule: దేశవ్యాప్తంగా 57 కంటోన్మెంట్లకు కేంద్రప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. దాంట్లో భాగంగానే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒకటిగా ఉంది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల ప్రణాళికను రూపొందించిన బోర్డు... అభ్యంతరాలు ఉంటే చెప్పాలని బోర్డు సీఈవో మధుకర్ నాయక్ కోరారు.
మార్చి 1 నుంచి 4 వరకు కంటోన్మెంట్ ఎన్నికల ఓటర్ల సవరణ చేయనున్నారు. మార్చి 1 నుంచి 4 వరకు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. మార్చి 23న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనుండగా.. మార్చి 28, 29 తెేదీల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అదే విధంగా ఏప్రిల్ 6న కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థుల నుంచి పేర్లను ప్రకటించడం జరుగుతుంది. ఇక కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు ఏప్రిల్ 30న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
దేశంలోని 57 కంటోన్మెంట్లకు కేంద్రప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం కంటోన్మెంట్ బోర్డులో అత్యవసర సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశేఖర్, సీఈఓ మధుకర్ నాయక్, నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పాల్గొని ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఈఓ మధుకర్ నాయక్ పలు అంశాలపై మాట్లాడారు.
కంటోన్మెంట్లో ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన నేపధ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని మధుకర్ నాయక్ తెలిపారు. మార్చి 1 నుంచి ఓటర్ల నమోదు, సవరణలకు కంటోన్మెంట్ వాసులకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోడ్ అమలు ఉన్న నేపధ్యంలో ఎటువంటి ప్రారంభోత్సవాలు, కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ఉండవని పేర్కొన్నారు. రోజువారి పనులు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. కంటోన్మెంట్ వాస్తవ్యులు మాత్రం తప్పకుండ ఓటర్ల లిస్టులో పేర్లు నమోదు చేసుకొని ఎన్నికలలో పాల్గొని తమకు నమ్మకమున్న నాయకున్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి: