ఫిలిం నగర్ గృహ నిర్మాణ సహకార సంఘంలో అవకతవకలు జరిగాయని సుపరిపాలన వేదిక.. గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి తమిళి సైకి లేఖ రాశారు. సినీ పరిశ్రమలో పనిచేసే వారికి గృహ నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం 1980లో 95 ఎకరాల భూమి కేటాయించిందని.. దీనికి గాను ఫిలింనగర్ గృహ నిర్మాణ సహకార సంఘం ఎకరాకు 8 వేల 500 చొప్పున చెల్లించిందని ఆయన తెలిపారు. ఫ్లాట్ల కేటాయింపులో ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, అవినీతి చోటు చేసుకున్నాయని పద్మనాభ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
అక్రమాలు నిర్ధరణ అయ్యాయి..
రాధాకృష్ణ కమిషన్, కిరణ్మయి, భాస్కరాచారి నివేదికలో అక్రమాలు నిర్ధరణ అయ్యాయని.. నివేదిక బయటికి రాకుండా చేస్తున్నారని పద్మనాభ రెడ్డి తెలిపారు. ఫిల్మ్ నగర్ గృహ నిర్మాణ సహకార సంఘం కార్యదర్శి సూర్యనారాయణ, సినీ నటుడు మురళి మోహన్ అక్రమాలకు పాల్పడ్డారని నివేదికలో తెలినట్లు పద్మనాభ రెడ్డి లేఖలో ఆరోపించారు.
నివాస సముదాయాలను వాణిజ్య సముదాయాలుగా మార్చారని, పార్క్ స్థలంలోనూ నిర్మాణాలు చేశారని ఆయన తెలిపారు. నివేదికలోని అంశాలు బయటికి రాకుండా కొంతమంది సచివాలయ అధికారులు కొమ్ము కాస్తున్నారన్నారు. దీనిపై అనిశాతో దర్యాప్తు చేయించి వాస్తవాలు బయటికి తీసుకురావాలని సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి.. గవర్నర్‌ను కోరారు.
ఇవీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా 36 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు