రాష్ట్రంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 4 వేల పశువుల కొట్టాలు నిర్మించుకోవడానికి అవకాశం ఉందని పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో పశుసంవర్థక శాఖ కార్యకలాపాలపై సమీక్షించారు.
రాష్ట్రంలో లంపి స్కిన్ వ్యాధి నివారణకు 4 కోట్ల రూపాయలు కేటాయించిన దృష్ట్యా... అన్నిజిల్లాల్లో అధికారులు తీసుకున్న చర్యలు, పశు వైద్య శిబిరాల నిర్వహణపై విస్తృతంగా చర్చించారు. ఈ వ్యాధి అదుపులోకి వచ్చిందని జిల్లా అధికారులు తెలిపారు. ఇటీవల భారీ వర్షాలకు గొర్రెలు మేకల్లో సోకిన బ్లూటాంగ్, పుట్ రాట్ నియంత్రణకు 2 కోట్ల రూపాయల మందులు కేటాయించిన తరుణంలో పశు వైద్య శిబిరాలు నిర్వహణపై ఆరా తీశారు.
వచ్చే నెల మొదటి వారంలో 34.26 లక్షల గోవులు, 33.09 లక్షల గేదె జాతి, 190.630 లక్షల గొర్రెలు, 45.39 లక్షల మేకలకు నట్టల నివారణ మందులు వేస్తామని కార్యదర్శి వెల్లడించారు. కావాల్సిన పశు వైద్య సిబ్బందిని బృందాలుగా విభజించి నిర్ణీత తేదీల్లో గ్రామాలను సందర్శించి 100 శాతం నట్టల నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఇందుకు 9 కోట్ల రూపాయలు గోవులు, గేదెలు, 4.7 కోట్ల రూపాయలు గొర్రెలు మేకలు నట్టల నివారణ నిమిత్తం మందులకు కేటాయించడం జరుగుతుందన్నారు. పశువైద్యుల నైపుణ్యం పెంచడానికి అధునాతన వైద్య సేవలు రైతులకు అందించేలా శిక్షణ చేపట్టాలని ఆదేశించారు. పశు సంపదకు కావాల్సిన పచ్చి మేతల లభ్యత, పచ్చి మేతలపై నివేదికలు తయారు చేసి వ్యవసాయ శాఖకు సమర్పించినట్లైతే సమగ్ర వ్యవసాయ విధానంలో పశుగ్రాసాల పెంపకం చేపట్టేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.