హైదరాబాద్ ఎర్రమంజిల్లోని రహదార్లు-భవనాల శాఖ ఈఎన్సీ కార్యాలయంలో సచివాలయ భవన సముదాయ నిర్మాణానికి సంబంధించి నేడు ప్రీబిడ్ సమావేశం జరగనుంది. ఇప్పటి వరకు షాపుర్ జీ పల్లంజీ, టాటా, ఎల్అండ్టీ, జేఎంఎం, యూపీసీ కంపెనీలు ఆసక్తి కనబర్చినట్లు తెలిసింది. బిడ్ల దాఖలుకు ఈ నెల 13వ తేదీ వరకు గడువు ఉంది. అదే రోజు సాంకేతిక బిడ్లను తెరుస్తారు. ఆర్థిక బిడ్లను మాత్రం 16వ తేదీన తెరుస్తారు. అటు సచివాలయ భవన సముదాయంలో ఒక్కో మంత్రిత్వ శాఖకు 8640 చదరపు అడుగులను కేటాయిస్తున్నట్లు సమాచారం. సంబంధిత శాఖ మంత్రితో పాటు పేషీ, కార్యదర్శి, విభాగాలు, సందర్శకుల గది, 50 మంది సామర్థ్యంతో సమావేశ మందిరం అన్నీ అందులోనే రానున్నాయి. మసీదులను మొన్నటివరకు ఉన్న స్థలంలోనే సచివాలయ భవనం వెనకవైపు నిర్మించనున్నారు.
దేవాలయం, చర్చి, ఉద్యోగుల సౌకర్యాలు, అగ్నిమాపక కేంద్రం తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు రానున్నాయి. సచివాలయ భవనం చుట్టూ, ప్రాంగణంలోని నలువైపులా విశాలమైన రహదార్లు రానున్నాయి. సచివాలయ ప్రాంగణం చుట్టూ విశాలమైన రహదార్లను అభివృద్ధి చేసి మిగతా నిర్మాణాలను వేరు చేస్తారు. ప్రధాన భవనం ముందు విశాలమైన పచ్చిక బయళ్లు, పెద్ద ఫౌంటెయిన్లు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తారు. వీవీఐపీ, మంత్రులు, కార్యదర్శులు, ఉద్యోగులు, సందర్శకులకు వేర్వేరు ప్రవేశ ద్వారాలు ఉండనున్నాయి. విడివిడిగా పార్కింగ్ సదుపాయాన్ని కల్పించనున్నారు.
ఇదీ చదవండి: 'క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ మండలి ఏర్పాటు వివరాలు సమర్పించండి'