రాష్ట్ర పరిపాలనా కేంద్రం... చిరునామా మారింది. ఇక నుంచి సచివాలయ కార్యకలాపాలు బూర్గుల రామకృష్ణారావు భవన్ వేదికగా జరగనున్నాయి. కొత్త సచివాలయ భవనాల నిర్ణయం నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. బుధవారం నుంచి తరలింపు ప్రక్రియ ప్రారంభం కాగా... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా అన్ని శాఖల కార్యదర్శులు శుక్రవారం బీఆర్కే భవన్‌కు తరలివెళ్లారు. అక్కడ వారి కార్యాలయాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.
ఇంకా ఏర్పాటు కాని సర్వర్లు, నెట్‌వర్క్ వ్యవస్థ:
కార్యాలయాలు తరలించినప్పటికీ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కొనసాగించేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం సచివాలయం కోసం వినియోగిస్తున్న సర్వర్లు, నెట్‌వర్క్ వ్యవస్థను బీఆర్కే భవన్‌లో నెలకొల్పేందుకు చాలా సమయం పడుతుంది. అయితే ప్రస్తుతానికి ఇంటర్నెట్, ఇంట్రానెట్ సదుపాయం కల్పించి బీఆర్కే భవన్ నుంచే కార్యకలాపాలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.
కొనసాగుతున్న మరమ్మతులు:
భవన్‌లో మరమ్మతులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆర్ అండ్ బీ అధికారులతో చర్చించిన ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి.....మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తిస్థాయి వ్యవస్థ ఏర్పాటయ్యే వరకు కుందన్‌బాగ్‌లోని అధికారిక నివాసం నుంచే కార్యకలాపాలు కొనసాగించాలన్న ఆలోచనలో సీఎస్ జోషి ఉన్నట్లు సమాచారం.
సీఎంవో తరలింపునకు సిద్ధం
ముఖ్యమంత్రి కార్యాలయ తరలింపునకూ రంగం సిద్ధమవుతోంది. సీఎంవో కార్యదర్శుల కార్యాలయాలను కూడా బేగంపేటలోకి మెట్రో రైల్‌భవన్‌కు తరలించనున్నారు. కార్యదర్శుల పేషీలను మాత్రం ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు తరలించాలని ప్రతిపాదించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కార్యాలయాన్ని బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి తరలించారు. మిగతా మంత్రుల కార్యాలయాలను కూడా తరలిస్తున్నారు.
అసంతృప్తిగా ఉన్న పేషీలు:
ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని కార్యాలయాలపై పేషీల అధికారులు అసంతృప్తిగా ఉన్నారు. చాలా నెలలుగా అవి నిరుపయోగంగా ఉన్నాయని... తాము కార్యకలాపాలు కొనసాగించేందుకు అనువుగా లేవని కార్యదర్శుల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయ పేషీకి కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
ఇవీ చూడండి : నాగార్జున సాగర్‌కు వరద... రైతుల్లో ఆశలు