రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోరు ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు, అభ్యర్థుల తరఫున హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఎలాగైనా మండలిలో పాగా వేయాలన్న ధ్యేయంతో సభలు, సమావేశాలతో నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు.
తీవ్ర ఉత్కంఠ
అధికార తెరాసతో పాటు భాజపా, కాంగ్రెస్ రెండు చోట్లా అభ్యర్థులను బరిలో దింపి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. పలువురు స్వతంత్రులు బరిలో ఉన్న ఎన్నికలు సహజంగానే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రెండు చోట్లా ఐదు లక్షలకు పైగా ఓటర్లుండగా... అభ్యర్థులకు ప్రాధాన్యతా క్రమంలో 1, 2, 3, 4... ఇలా ప్రాధాన్య ఓట్లు ఇవ్వవచ్చు. పోలై చెల్లుబాటైన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు వస్తే ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు.
కీలకంగా రెండో ప్రాధాన్యతా ఓట్లు
సాధారణంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో మొదటి ప్రాధాన్యతా ఓట్లతోనే గెలవడం అరుదు. రెండో ప్రాధాన్యతా ఓట్లు అత్యంత కీలకంగా మారనున్నాయి. సాధారణంగా రెండో ప్రాధాన్య ఓట్లు అభ్యర్థుల గెలుపులో కీలకపాత్ర పోషించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజా పట్టభద్రుల ఎన్నికల్లోనూ రెండో ప్రాధాన్యతా ఓట్లు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.
పార్టీలన్నీ అప్రమత్తం
రెండు నియోజకవర్గాల్లోనూ ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్రమత్తమైన రాజకీయ పార్టీలు వీలైనన్ని ఎక్కువగా మొదటి ప్రాధాన్యతా ఓట్లు పొందాలన్న ధ్యేయంగా పనిచేస్తున్నాయి. ఆ మేరకు పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య ఆధారంగా ఇన్ఛార్జీలను నియమించి ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఓటర్లను ఇన్ఛార్జీలు వ్యక్తిగతంగా కలుస్తున్నారు. ఒకటో ప్రాధాన్యతా ఓటు మాత్రమే వేయాలంటూ కొన్ని పార్టీలు వ్యూహాత్మకంగా ఓటర్లను చైతన్య పరుస్తున్నాయి.
ఇదీ చూడండి: సాగర్‌లో ఘన విజయం సాధించాల్సిందే: కేసీఆర్