హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన పలు కాలనీల్లో పురపాలక మంత్రి కేటీఆర్ రెండోరోజు పర్యటించారు. ఇవాళ ముషీరాబాద్, అంబర్పేట్, కార్వాన్ నియోజకవర్గంలో మంత్రి పర్యటించి.. వరద ముంపు ప్రాంతాలను, కాలనీల్లో పరిస్థితిని స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్షించారు.
అవస్థలపై ఆరా...
ఉదయం నల్లకుంటలోని శ్రీరామ్‌నగర్ బస్తీలో స్థానిక ఎమ్మెల్యే ముఠాగోపాల్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి వర్షానికి దెబ్బతిన్న కాలనీలలో కలియతిరిగారు. బుధవారం రామంతాపూర్‌లోని ప్రగతినగర్ చెరువు ముంపు ప్రాంతాల అవస్థలు తెలుసుకున్న కేటీఆర్.. ఇవాళ అంబర్‌పేట్‌లోని ప్రేమ్‌నగర్, పటేల్‌నగర్ ప్రాంతాల వారి గోడు విన్నారు.
షాతం చెరువు పరిశీలన...
స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, జీహెచ్‌ఎంసీ అధికారులను పరిస్థితులు అదుపు తప్పటానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి టోలీచౌకిలోని నదీంకాలనీలో నీట మునిగిన ఇళ్లను, అక్కడి నుంచి ఎంపీ అసదుద్దీన్‌తో కలిసి షాతం చెరువును మంత్రి పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు, కలెక్టర్‌తో పరిస్థితిని సమీక్షించగా... షాతం చెరువు పొంగిపొర్లటమే కారణమని వారు వివరించారు.
అసద్‌తో పాటుగా...
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ వాహనంలో కేటీఆర్ షాతం చెరువుకు వెళ్లి... చెరువును ఆనకొని ఉన్న నిర్మాణాలు, పరిసరాలను పరిశీలించారు. నీట మునిగిన కాలనీవాసులకు భరోసా కల్పిస్తూనే... ఆయా కాలనీల్లో వరద నివారణ కోసం శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇందుకు సంబంధించిన పనులకు వెంటనే అనుమతులు కూడా ఇచ్చారు. కాలనీలో వరద రాకుండా చేపట్టాల్సిన చర్యలు, పైప్లైన్లు, డ్రైనేజీల నిర్మాణానికి సంబంధించి వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు.
ఇదీ చూడండి: వర్షాలు తగ్గినా కొనసాగుతోన్న వరద ఉద్ధృతి