పురపాలిక ఎన్నికలపై రీజినల్ వారీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించారు. ఎన్నికలకు అధికార యంత్రాంగాన్ని సన్నద్దం చేసేందుకు రీజినల్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతోనూ రీజియన్ల వారీగా విడిగా సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. రేపట్నుంచి మూడు రోజుల పాటు వేర్వేరు ప్రాంతాల్లో సమావేశాలు జరగనున్నాయి.
ఈనెల 27, 28, మార్చి 1న ప్రాంతీయ సమవేశాలు నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయించారు. ఈనెల 27న తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ ,సెనేట్ హాల్ లో తొలి రీజినల్ సమావేశం జరగనుంది. చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల అధికారులతో సమావేశమవుతారు. ఆరోజు మధ్యాహ్నం 3.15 గంటల నుంచి 5:30 వరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 5 జిల్లాల్లో గుర్తింపు, రిజిష్ట్రేషన్ పొందిన రాజకీయ పార్టీల నేతలతో ఎస్ఈసీ సమావేశమవుతారు.
ఈ నెల 28న విజయవాడలోని తన కార్యాలయంలో రెండో రీజినల్ సమావేశం నిర్వహిస్తారు. అదే రోజున ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా అధికారులతో ఎస్ఈసీ సమావేశమవుతారు. ఆ రోజే మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులతో సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం 6గంటల నుంచి 7గంటల వరకు 4జిల్లాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమవుతారు.
మార్చి 1న విశాఖపట్నంలో మూడో రీజినల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ తెలిపారు. తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా అధికారులతో సమావేశమవుతారు. మార్చి 1న మధ్యాహ్నం 3.15 గంటల నుంచి 5.30 గంటల వరకు జిల్లా అధికారులతో ఎస్ఈసీ సమీక్ష జరుపుతారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు 4 జిల్లాల్లోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఈసీ సమావేశమవుతారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పటిష్ట భద్రత, నిఘా ఏర్పాటు, మద్యం సరఫరా నివారణ, ఓటరు స్లిప్పుల పంపిణీ అంశాలపై ఆదేశాలివ్వనున్నారు. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణ, కొవిడ్ నివారణ, ఓటు హక్కు వినియోగం కోసం ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడం తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఎస్ఈసీ ఆదేశాలు ఇస్తారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయ సేకరణ చేయనున్నారు. రీజినల్ సమావేశాలకు తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: న్యాయవాద దంపతుల హత్యలో తెరాస నేతల పాత్ర ఉంది: కాంగ్రెస్