Local Body Elections: స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఖాళీగా ఉన్న పలు జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్, కార్పొరేట్ స్థానాలకు ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు ప్రారంభించింది. ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జడ్పీసీఈఓలు, డీపీఓలు, మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి దృశ్యమాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. పురపాలక, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు కూడా సమీక్షలో పాల్గొన్నారు.
ఓటర్ల జాబితా తయారీకి ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశామన్న ఎస్ఈసీ... ఈనెల ఎనిమిదో తేదీన ముసాయిదా జాబితాలు ప్రచురించాలని తెలిపింది. 2022 జనవరి ఒకటో తేదీ ప్రాతిపదికగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రచురించిన జాబితా ఆధారంగా స్థానికసంస్థల ఓటర్ల జాబితాలు రూపొందించాలని, 24వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల ప్రచురించాలని చెప్పారు. వార్డు సరిహద్దులను తప్పక పాటించాలన్న పార్థసారథి... ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక వార్డు ఓటరును మరో వార్డులోకి చేర్చరాదని స్పష్టం చేశారు.
ముసాయిదాపై అభ్యంతరాలు, సలహాలు స్వీకరించాలని... రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి కూడా తీసుకొని పరిష్కరించాలని వివరించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పక్కాగా ఓటర్ల జాబితా రూపొందించాలని, ఎన్నికలు సాఫీగా జరుగుతాయని ఎస్ఈసీ చెప్పారు. ఓటర్ల జాబితా సిద్దమయ్యాక పోలింగ్ స్టేషన్ల ఖరారు కోసం షెడ్యూల్ ఇస్తామని తెలిపారు. చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొంది ఎన్నికల నిర్వహణకు తేదీలు ప్రకటిస్తామని పార్థసారధి తెలిపారు.
ఇదీ చూడండి: విద్యారంగంలో రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్