తెలంగాణలో కరోనా లేదని.. విదేశాల నుంచి వచ్చే వారి వల్లే వైరస్ ప్రబలే అవకాశం ఉందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన థర్మల్ స్క్రీన్ కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. ఎయిర్‌పోర్టులో గతంలో కేవలం 11, 12 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను మాత్రమే స్క్రీనింగ్ చేసేవాళ్లమని.. ఇప్పుడు ప్రపంచ దేశాలనుంచి వచ్చే ప్రతి ప్రయాణికున్ని స్క్రీనింగ్ చేస్తున్నామని అన్నారు.
విమానాశ్రయానికి రోజుకు 550 మంది విదేశాల నుంచి వస్తుంటారని... ఇక్కడ ఉన్న నాలుగు ప్రధాన ద్వారాల వద్ద వీరందరినీ స్కానింగ్ చేస్తారని ఈటల పేర్కొన్నారు. ఎవరైనా వ్యాధి లక్షణాలతో కనిపిస్తే ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రూమ్‌లోకి తీసుకెళ్లి... అతనికి పూర్తిగా మాస్కులు వేసి ప్రత్యేక వాహనంలో గాంధీకి తరలిస్తామని చెప్పారు. రేపట్నుంచి 24/7 థర్మల్ స్క్రీనింగ్ చేసే ఏర్పాట్లు చేస్తామని.. అందరినీ స్కానింగ్ చేస్తామని మంత్రి ప్రకటించారు.
ఇదీ చూడండి: దలాల్ స్ట్రీట్ ఢమాల్- సెన్సెక్స్ రికార్డు పతనం