పట్టభద్రుల కోటా నుంచి ఎన్నికైన ఇద్దరు శాసనమండలి సభ్యుల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నుంచి ఎన్నికైన రామచంద్రారావు, నల్గొండ-వరంగల్-ఖమ్మం నుంచి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి పదవీకాలం పూర్తవుతోంది. గడువులోగా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఆ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల ముందస్తు ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది.
ప్రక్రియ పూర్తి...
ఇప్పటికే ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ పూర్తయింది. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల తుదిజాబితా కూడా ప్రకటించారు. నియోజకవర్గంలో మొత్తం నాలుగు లక్షల 91వేల 396 మంది ఓటుహక్కు నమోదు చేసుకున్నారు. పోలింగ్ కోసం 546 కేంద్రాలను గుర్తించారు.
రేపు తుదిజాబితా...
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల తుదిజాబితా రేపు ప్రకటించనున్నారు. ఓటర్ల జాబితాను ప్రకటించాక ఎప్పుడైనా ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయవచ్చని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మార్చి 29లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. కనీసం 45 రోజుల ముందు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాలి.
వచ్చే నెలలో...
వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకొంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
వేడెక్కిన రాజకీయం...
ప్రధాన పార్టీలు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గంతో పోలిస్తే నల్గొండ- వరంగల్-ఖమ్మం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం వాతావరణం వేడెక్కింది.