Sankranti Celebrations 2024 in Telangana : సరదాల సంక్రాంతికి తెలుగు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. తొలి రోజు భోగి పండుగ సంబురాలు ఊరూరా, వాడవాడనా అంబరాన్నంటాయి. భోగి మంటల్లో చలి కాగుతూ భోగి పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామున పిల్లలు, పెద్దలు సందడి చేశారు. రాజకీయ నాయకులు పతంగలు ఎగురవేస్తూ సందడి చేశారు.
BJP State Chief Kishan Reddy on Sankranti Festival : ఆరుగాలం రైతులు పండించిన పంట ఇంటికొచ్చిన సందర్భంగా జరుపుకునే సంక్రాంతి పండుగను ప్రపంచమంతా నేడు జరుపుకుంటోందని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్లో ఆయన పాల్గొని పతంగి ఎగరేశారు. పొట్టకూటి కోసం పట్టణాలకు వచ్చిన ప్రజలంతా పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లడం శుభసూచకమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే అద్భుతమైన పండుగ సంక్రాంతి అని తెలిపారు. జనవరి 22న జరిగే అయోధ్య రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టకు అందరూ హాజరు కావాలని కోరారు.
శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు - సొంతూరుకు వెళ్లిన అనుభూతి కలిగిందన్న సందర్శకులు
BRS MLA Talasani On Sankranti Celebrations : మన సంప్రదాయం దేశానికి చాటి చెప్పేలా ఉందని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్లో ఆయన పాల్గొని పతంగిని ఎగరేశారు. ఒకప్పుడు పండుగకు 4 నెలల ముందు నుంచే పతంగిల సందడి ఉండేదని, కానీ ప్రస్తుతం వెస్టర్న్ సంస్కృతి వల్ల దానిపై ఆసక్తి కొరవడిందని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా జరగని భిన్నమైన పండుగలు మన రాష్ట్రంలో జరుగుతాయని, తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఓరుగల్లులో సంక్రాంతి సంబురాలు అంబరాన్ని తాకాయి. హనుమకొండలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన కైట్స్ ఫెస్టివల్ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ రాధికా గుప్తా ఈ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. పిల్లలతో పాటు పెద్దవాళ్లూ ఉత్సాహంగా ఇందులో పాల్గొని పతంగులు ఎగురవేశారు. స్టాళ్లలో ఏర్పాటు చేసిన పిండివంటలు అందరినీ నోరూరించాయి. ఈ పండుగను సంతోషంగా సరదాగా జరుపుకోవాలని, గాలిపటాలు ఎగరవేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కార్యక్రమానికి హాజరైన అతిథులు సూచించారు.
రాజ్‌భవన్‌లో ఘనంగా సంక్రాంతి సంబురాలు
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఖమ్మంలో భోగి మంటలతో వీధులన్నీ దేధీప్యమానంగా వెలిగిపోయాయి. మంటల చుట్టూ చేరి ఉత్సాహంగా సంక్రాంతి పండుగ పాటలకు నృత్యాలు చేశారు. ఇంటి ముందు రంగవల్లులు వేస్తూ సందడి చేశారు. పాత వస్తువులను భోగి మంటల్లో వేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలు పల్లెలు, పట్టణాల్లో ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. మధిర నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లు, వీధుల్లో యువత, చిన్నారులు, మహిళలు భోగి మంటలు వేసి నృత్యాలు చేశారు.
ఇంటింటా కొత్త కాంతులు వెల్లివిరియాలి - హ్యాపీ సంక్రాంతి : సీఎం రేవంత్ రెడ్డి
కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో భోగి మంటలు వేసి వేడుకలు జరుపుకున్నారు. తెలంగాణ చౌక్‌లో భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో వేకువజామునే మహిళలంతా ఒకచోట చేరి భోగి మంటలు వేశారు. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొని ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గోదావరిఖని చౌరస్తాలో గంగిరెద్దులతో చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొని పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జరిపిన వేడుకల్లో యువతీయువకులు పాల్గొని కోలాట నృత్యాలతో అలరించారు.
Bhogi Celebrations At MLC Kavitha Residence : నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత ఇంటి ఆవరణలో భారత జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటలు ఘనంగా నిర్వహించారు. మేయర్ దండు నీతూ కిరణ్, జాగృతి నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిచ్పల్లి మండలం ధర్మారంలో పాత వస్తువులను భోగి మంటల్లో వేసి కీడు తొలగిపోవాలని స్థానికులు కోరుకున్నారు. మహబూబాబాద్ ప్రభుత్వ కళాశాలలో భోగి మంటల్లో రావి, మామిడి, మేడి తదితర చెట్ల కలప, ఆవు నెయ్యి వేశారు. మూడ్రోజుల పండుగలో భాగంగా తొలిరోజు భోగభాగ్యాలు తెచ్చే భోగి పండుగను ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు అట్టహాసంగా జరిపారు. మంచిర్యాలలో వాకిళ్ల ముందు రంగవల్లులు, గొబ్బెమ్మలు చూపరులను ఆకట్టుకున్నాయి. స్థానికులు కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటల చుట్టూ తిరుగుతూ సంబురాలు చేశారు.
Bhogi Celebrations in Hyderabad : భాగ్యనగర వాసులు భోగి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. తెల్లవారు జాము నుంచే భోగీ మంటలు వేసి పిల్లలు, పెద్దలు సందడి చేశారు. బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద భారత జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నృత్యాలతో సందడి చేశారు. కూకట్‌పల్లి మలేషియన్ టౌన్ షిప్‌లో భోగి మంటలు, గంగిరెద్దుల ఆటలు, హరిదారుల సంకీర్తనలు, కళాకారుల ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. శిల్పారామంలో పల్లెటూరు వాతావరణం ప్రతిబింబించేలా అలంకరణ చేశారు. చిన్ననాటి మధుర స్మృతులను నెమరవేసుకుంటూ ప్రజలు ఆనందంగా గడిపారు.
సంక్రాంతి స్పెషల్ - భోగి మంటలతో వెలుగులీనుతున్న తెలుగు లోగిళ్లు