కోడి పందేల నిర్వహణలో ముందుండే ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గన్నవరం నియోజకవర్గంలోని అంపాపురంలో కోడి పందాలకు మొత్తం నాలుగు బరులను సిద్ధం చేశారు. ఈసారి పందెంరాయుళ్లను మూడు కేటగిరీలుగా విభజిస్తున్నట్లు తెలిసింది. ప్రవేశ రుసుమును బట్టి వసతులు కల్పించనున్నారు. పందాలు జరిగేటప్పుడు నగదు నేరుగానే కాకుండా డిజిటల్ లావాదేవీలు జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. అందరికీ పందేలు కనపడేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేయనున్నారు . ఈ ప్రాంగణానికి కొద్ది దూరంలో వాలీబాల్, కబడ్డీ లాంటి ఆటలను నిర్వహిస్తున్నారు.
150 కోట్ల రూపాయలు చేతులు మారుతాయని: కోడి పందేలకు పెద్దపీట వేసే పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. తణుకు పరిసరాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పందాలు చూడ్డానికి వచ్చేవారి కోసం షామియానాలు ఏర్పాట్లు చేస్తున్నారు. కోడి పందాలు జరిగే రోజుల్లో ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు 150 కోట్ల రూపాయలు చేతులు మారుతాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పందేలు జరిగే ప్రదేశాలకు దగ్గర్లోని లాడ్జిల్లో ఇప్పటికే బుకింగ్‌లు పూర్తి అయ్యాయి.
పోలీసుల విశ్వప్రయత్నాలు: ఒకపక్క పందెంరాయుళ్లు సిద్ధమవుతుంటే వారిని నియంత్రించడానికి పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కోడికత్తులను ముందే స్వాధీనం చేసుకున్నారు. పందెంరాయుళ్లు ఏర్పాటు చేసుకున్న కోడిపందెం బరులను రెడ్డిగూడెం పోలీసులు ధ్వంసం చేశారు. కోడిపందాలు నిర్వహించేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అధికార పక్షమే బరి ఏర్పాటు : ప్రతిపక్షాలవారు, తమకు కప్పం కట్టని పందేల నిర్వాహకులు బరులు ఏర్పాటు చేయకుండా.. అధికార పార్టీ నేతలు పోలీసులతో ముందే కట్టడి చేయిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వారు బరి వేయకుండా.. అప్పటి మంత్రి రంగనాథరాజు తెర వెనుక ఉండి అడ్డుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఈ మూడేళ్లలో కోడిపందేల నిర్వహిస్తున్న వారిపై .. 3 వేల 27 కేసులు నమోదు చేసి.. 6 వేల 455 మందిని అరెస్ట్ చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ మూడేళ్లలో 17 వందల 37 కేసులు నమోదు చేసి.. 5 వేల 403 మందిని అరెస్ట్ చేశారు. రెండు చోట్లా కలిపి కోటి రూపాయలకు పైగా నగదు, దాదాపు 8 వేల కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ప్రతిపక్షాలవారివి, అధికార పార్టీ నేతలకు కప్పం కట్టని నిర్వాహకులవేనన్న ఆరోపణలున్నాయి.
ఇవీ చదవండి