Sahitya Infratech Ventures India Pvt Ltd Victims worried at CPS: హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ముందు సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బాధితులు ఆందోళనకు దిగారు. నిన్న సంస్థ ఎండీని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న బాధితులు పెద్దఎత్తున తరలివచ్చి.. ఎండీ లక్ష్మీ నారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్పులు చేసి డబ్బులు చెల్లించామని తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
అమీన్పూర్లో ప్రీ లాంచ్ పేరుతో 2500 మంది వినియోగదారుల దగ్గర సాహితీ గ్రూప్ రూ.900 కోట్లు వసూలు చేసి.. వెంచర్ని స్టార్ట్ చేయలేదని వాపోయారు. ప్రాజెక్ట్ ఫెయిల్ కావడంతో 18 శాతం వడ్డీతో డబ్బులు తిరిగిస్తానని లక్ష్మీనారాయణ చెక్లు ఇచ్చారని పేర్కొన్నారు. చెక్కులు బౌన్స్ అయ్యాయని.. తమ నగదు మొత్తం కూడా సాహితీ ఇన్‌ఫ్రాటెక్ సంస్థ నుంచి తిరిగి ఇప్పించాలని కోరారు.
"నేను కోటి రూపాయలు పెట్టుబడి పెట్టాను. మొత్తం మోసపోయాను. నా తల్లి, భార్య వాళ్ల బంగారం.. లోన్లు తీసుకొని ఈ సాహితీ ఇన్ఫ్రాటెక్లో ఇల్లుకు డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు చూస్తే రేపోమాపో అంటూ వస్తున్నారు." -బాధితుడు
అసలేం జరిగింది: సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణ ప్రీలాంచ్ ప్రాజెక్టుల పేరుతో 2,500 మంది నుంచి రూ.900 కోట్లు వసూలు చేసి.. అందరినీ మోసం చేశారు. సాహితీ ఇన్‌ఫ్రా టెక్ ఎండీ లక్ష్మీనారాయణ 2019లో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ గ్రామంలో సాహితీ శరవణి ఎలైట్ పేరుతో ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 23 ఎకరాల్లో 38 అంతస్తులతో పది అపార్టుమెంట్లు నిర్మిస్తున్నామని, రెండు, మూడు పడక గదుల ఫ్లాట్లు ఉంటాయని చెప్పాడు. ప్రపంచస్థాయిలో వసతులతో తక్కువ ధరకే నిర్మిస్తామని, ప్రీ లాంఛ్ ఆఫర్ అంటూ 1,700 మంది నుంచి రూ.539 కోట్ల మేర వసూలు చేశాడు.
వాస్తవానికి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి హెచ్‌ఎండీఏ నుంచి ఎలాంటి అనుమతీ తీసుకోలేదు. భూసేకరణ, అనుమతులు, ప్రాజెక్టు నిర్మాణానికి కొంత సమయం పడుతుందని తొలుత చెప్పాడు. మూడేళ్లు పూర్తయినా ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో కొందరు బుకింగ్ రద్దు చేసుకుంటామని, డబ్బు వెనక్కి ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు. దీంతో సేకరించిన సొమ్మును సంవత్సరానికి 15-18 శాతం వడ్డీతో తిరిగి ఇస్తానని లక్ష్మీనారాయణ హామీ ఇచ్చాడు. ఆ తర్వాత కొందరికి చెక్కులు ఇచ్చినా బౌన్స్ అవ్వడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
ఇవీ చదవండి: