తెలుగురాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో అయ్యప్ప స్వాములు శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకోవాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎన్.వాసు నాయర్ కోరారు. దేశంలో అధిక శాతం ప్రజలు కొవిడ్ టీకాలు తీసుకున్న నేపథ్యంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఫ్యాప్సి ఆడిటోరియంలో భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో శబరిమల యాత్రపై సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల గురు స్వాములు, అయ్యప్ప సేవా సమితి ప్రతినిధులతో ఈ సమావేశంలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా చర్యలు చేపట్టాలని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు కె.రాధాకృష్ణ బోర్డు సభ్యలకు విన్నవించారు.
దేశంలోని నలుమూలల నుంచి శబరికి ప్రతి సంవత్సరం దాదాపు 2 కోట్ల మంది అయ్యప్ప స్వాములు వస్తుంటారని బోర్డు అధ్యక్షుడు వాసు నాయర్ తెలిపారు. దేశాన్ని పట్టి పీడించిన కరోనా మహమ్మారి వల్ల బోర్డులు కొన్ని ఆంక్షలు విధించాయని తెలిపారు. కరోనా నిబంధనలతో అయ్యప్ప స్వాములు సగానికి తగ్గిపోయారని వెల్లడించారు. అయ్యప్ప గురుస్వాములు ఇచ్చిన సలహాలు, సూచనలను త్వరలో జరిగే బోర్డు సమావేశంలో చర్చించి స్వాములకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఏడాది శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని వాసు నాయర్ స్పష్టం చేశారు.
రెండేళ్లుగా శబరిమలకు వెళ్లలేక భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. కరోనా నిబంధనల వల్ల చాలామంది అయ్యప్పస్వామి దర్శనానికి దూరమయ్యారు. ఆన్లైన్ విధానం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. కానీ ఈ ఏడాది భక్తుల ఇబ్బందులపై ఈ రోజు బోర్డు సభ్యులతో చర్చించాం. భాగ్యనగర్ అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో మేం ఈరోజు వారికి సమస్యలను వివరించాం. శబరిమలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. - కె.రాధాకృష్ణ, భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు