Rythu Vedikalu: రాష్ట్ర ప్రభుత్వం సమున్నతాశయంతో నిర్మించిన రైతువేదికలు లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. అన్నదాతల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేలా వీటిని రూపొందించాలని సీఎం కేసీఆర్ పలుమార్లు సూచించినా కిందిస్థాయి అధికారులు కొందరు వీటిగురించి పట్టించుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 2600 గ్రామాల్లో రైతువేదికలను రూ.570 కోట్ల వ్యయంతో వ్యవసాయశాఖ నిర్మించింది. ముఖ్యమంత్రి సహా కొందరు నేతలు విరాళాలిచ్చి వారి గ్రామాల్లో వీటి నిర్మాణానికి చేయూతనిచ్చినా.. వాటి వినియోగం గురించి క్షేత్రస్థాయి అధికారులకు శ్రద్ధ లేకుండా పోయింది.
ఒక్కోదానికి రూ.22 లక్షల చొప్పున ఖర్చుపెట్టినా.. రైతు వేదికల నిర్వహణకు డబ్బుల్లేక వినియోగించుకోవడం లేదు. మెదక్ జిల్లా కొత్తపల్లి, పోడ్చన్‌పల్లి వంటిచోట్ల వరిధాన్యం బస్తాల నిల్వకు గోదాములుగా ఈ వేదికలను వాడుతున్నందున రైతులు వచ్చినా కూర్చోవడానికి చోటులేదు. చాలా గ్రామాల్లో కనీసం తాగునీరు లేదు. మిషన్ భగీరథ పైపులైను నుంచి నీటి సదుపాయం కల్పించాలని ప్రభుత్వం చెప్పినా కిందిస్థాయి అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో తమ సొంత డబ్బులతో మంచినీరు కొనాల్సి వస్తోందని గ్రామ విస్తరణ అధికారులు (ఏఈఓ) వాపోతు.
విద్యుత్తు సదుపాయం ఏదీ: కొన్ని రైతువేదికలకు విద్యుత్తు సదుపాయం లేదు. నిర్మాణం అనంతరం హైదరాబాద్ నుంచి నేరుగా వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం లేదా మంత్రులు, అధికారులు రైతువేదికలో రైతులతో మాట్లాడే సదుపాయం ఉంటుందని తొలుత చెప్పారు. కానీ టీవీలు ఏర్పాటుచేయకపోవడంతో వీడియో కాన్ఫరెన్స్ లేకుండా పోయింది. ప్రతీ రైతువేదికకు నెలకు రూ.7500 ఇవ్వాలని ప్రతిపాదనలు పెట్టినా నిధులు విడుదలవ్వలేదు. వాచ్‌మెన్ లేకపోవడంతో.. ఏఈఓ గ్రామాలకు వెళ్లిన సమయంలో అక్కడికి రైతులెవరైనా వస్తే సమాధానం చెప్పేవారు కరవవుతున్నారు.
కొందరు ఏఈఓలు సుదూర ప్రాంతాల్లో నివాసముండటం, విధుల్లో ఉన్నవారు మారుమూల గ్రామాలకెళితే తిరిగి ఆ సమయంలో రాలేకపోతున్నారు. ఒక్కో వేదికలో 12 ఫ్యాన్లు పెట్టాలని తొలుత ప్రణాళికలో తెలిపారు. చాలాచోట్ల ఆరేడు కూడా ఏర్పాటు చేయలేదు. యాదాద్రి జిల్లా పాటిమట్ల రైతువేదిక వద్ద మరుగుదొడ్డి పేరుతో గోడలు కట్టి కప్పు వేసి అసంపూర్తిగా వదిలేశారు. మహిళారైతులు, మహిళా ఏఈఓలు మూత్ర విసర్జనకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల గ్రామాలకు దూరంగా వేదికలను నిర్మించడంతో రైతులు అంతదూరం రావడం లేదు.
అవగాహన కల్పించేదెలా: పంటల సాగులో కొత్త పద్ధతులు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ యంత్రాల వినియోగంపై ఆధునిక పరిజ్ఞానంపై రైతువేదిక వద్ద రైతులకు అవగాహన సమావేశాలు ఏర్పాటుచేయాలి. రైతుబంధు సమితుల ప్రతినిధులు, వ్యవసాయాధికారులు రైతులతో చర్చించాలి. రైతుబంధు సమితి కార్యకలాపాలేమీ లేవు. కొత్త పంటల సాగుపై రైతులకు అవగాహన సమావేశాలే పెద్దగా పెట్టడం లేదు. రైతుబంధు, రైతుబీమా సొమ్ములకు దరఖాస్తులు, ఫిర్యాదుల స్వీకరణతో సరిపోతోందని మిగతా కార్యక్రమాల నిర్వహణ ఖర్చులకు తామే సొంత సొమ్ము పెట్టుకోవాల్సి వస్తున్నందున ఏమీ చేయలేకపోతున్నట్లు కొందరు ఏఈఓలు చెప్పారు.
హమీదుల్లానగర్‌లో అసంపూర్తి నిర్మాణం..
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మల్కారం, హమీదుల్లానగర్‌లలో రైతు వేదికలను నిర్మించారు. హమీదుల్లానగర్‌లో శౌచాలయానికి తలుపులు లేవు. మంచినీటి సౌకర్యం లేదు.
గోదాముగా మారిన రైతువేదిక..
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లి రైతువేదికను రైసుమిల్లర్లు ధాన్యం నిల్వలతో గోదాముగా మార్చేశారు. ఇదే మండలం పోడ్చన్‌పల్లి రైతువేదికలోనూ ధాన్యం నిల్వచేశారు. దీంతో సమావేశాలు ఎక్కడ పెట్టుకోవాలంటూ రైతులు రావడం లేదు.
ఇవీ చదవండి..:
తడిసిన ధాన్యాన్ని ఏం చేద్దాం?.. అధికారుల మల్లగుల్లాలు..
సర్వశ్రేష్ఠుడు సర్వేపల్లి... విద్యావేత్త.. దౌత్యవేత్త.. రాష్ట్రపతి!