కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేయాలని స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. వ్యవసాయంపై ప్రభుత్వ విధానాలు, రైతుల సంక్షేమం కోసం పోరాడుతున్న రైతు స్వరాజ్య వేదిక 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సికింద్రాబాద్లోని తార్నాకలో మహాసభలు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రైతులు, జిల్లా స్థాయి, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు.
భూములున్న వారినే ప్రభుత్వాలు రైతులుగా గుర్తిస్తున్నాయని... కౌలు రైతుల శ్రమకు గుర్తింపు దక్కడం లేదని రచయిత రవి కన్నెగంటి అన్నారు. భూ యజమానులు క్షేత్ర స్థాయిలో వ్యవసాయం చేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. కౌలు చేసేవారు ఎక్కువగా చిన్న, సన్న కారు రైతులేనని.. వారిని ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను వారికి అందించాలని ఆయన కోరారు. ఈ విషయంలో తమ పోరాటం కొనసాగుతుందని రవి కన్నెగంటి తెలిపారు. ఈ సమావేశంలో ఆదివాసీ, కౌలు రైతులు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.