ప్రజారవాణా వ్యవస్థ.. ఆర్టీసీని కాపాడుకునేందుకే.. తమ పోరాటమని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. తమ జీతాలకు రూ.105 కోట్లయితే.. రూ.239 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం హైకోర్టును తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.
ఆర్టీసీ ఆస్తుల ఆక్రమణ..
సింగల్ టెండర్తో బినామీలకు, వారి బంధువులకు ఆర్టీసీ ఆస్తులను అప్పగిస్తున్నారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. వరంగల్లో 3ఎకరాల 56 సెంట్ల భూమిని స్థానిక ఎంపీకి అప్పగించారని.. హైదరాబాద్లోని బస్ భవన్ భూమిని ఆక్రమించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
విపక్ష నేతల మద్దతు..
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తమ మద్దతు ఉంటుందని విపక్షనేతలు స్పష్టం చేశారు. 50 వేల కుటుంబాలకు 4 కోట్ల మంది ప్రజలు అండగా ఉన్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ ప్రయోజనం కోసమే ఈ పోరాటం జరుగుతోందన్నారు. 30న జరిగే సకల జనుల సమరభేరికి అయ్యే ఖర్చులో 10 శాతం తాను భరిస్తానని ఎల్. రమణ భరోసానిచ్చారు. తాము చర్చలకు సిద్ధమని కార్మికులు చెప్పినా.. ప్రభుత్వం నుంచి స్పందన కరవైందన్నారు. ఈనెల 28 నాటికి కోర్టు సూచనల మేరకు సర్కారు చర్చలు జరుపుతుందని ఆచార్య కోదండరాం ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం కార్మికుల సంక్షేమాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఇక్కడెందుకు సాధ్యం కాదు..
కార్మికులు 18 రోజులుగా సమ్మె చేస్తున్నా.. సర్కారు పట్టించుకోవడం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు ఇక్కడెందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలాగే మరో ఉద్యమం త్వరలోనే రాబోతోందని భాజపా నాయకుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. సమ్మెకు అన్ని వర్గాలవారు మద్దతు తెలుపుతున్నారన్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 28న శుభవార్త చెబుతారని ఆశిస్తున్నాం: హైకోర్టు