RT PCR Report Delay in telangana: జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ విషయంలో కొంత మెరుగ్గానే ఉన్నా.. జిల్లాల్లో మాత్రం కనీసం 48 గంటలు దాటకుండా ఫలితం అందని పరిస్థితి నెలకొంది. వైద్యఆరోగ్యశాఖ రోజూ ఇచ్చే కొవిడ్ సమాచారంలోనే 10వేల దాకా ఫలితాలు పెండింగ్‌లో ఉంటుండడం గమనార్హం. యాంటిజెన్‌లో నెగెటివ్ వచ్చినా.. లక్షణాలు ఉన్నవారికి ఆర్‌టీపీసీఆర్ పరీక్షకు నమూనాలు సేకరిస్తున్నారు. ఫలితం ఆలస్యమవుతుండగా ఈలోగా లక్షణాలు తగ్గిన కొందరు యథేచ్ఛగా తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తద్వారా వైరస్ మరింతగా వ్యాపించే వీలుంది. ప్రభుత్వ వైద్యంలో ఫలితాల వెల్లడిలో జాప్యంతో అత్యధికులు ప్రైవేటుగా మళ్లీ పరీక్షలు చేయించుకొంటున్నారు. ఒక్కో పరీక్షకు అక్కడ రూ.1,500 వరకూ వసూలు చేస్తున్నారు.
వరంగల్‌కు చెందిన ఒక కుటుంబంలో వైరస్ లక్షణాలు కనిపించాయి. ర్యాపిడ్ యాంటిజెన్‌లో నెగెటివ్ అని తేలింది. లక్షణాలుండడంతో.. ప్రభుత్వ వైద్య సిబ్బంది ఆర్‌టీ పీసీఆర్ పరీక్షకు నమూనాలు స్వీకరించారు. 2 రోజులు గడిచినా ఫలితం రాలేదు. సిబ్బందిని ఆరాతీస్తే.. నమూనాలు తీయడం వరకే తమ పని అన్నారు. దీంతో ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్ష చేయించుకున్నారు. ఇందులో ఒకరికి పాజిటివ్.. మిగిలిన వారికి నెగెటివ్ అని ఫలితం వచ్చింది.
12 లక్షల కిట్లు అందుబాటులో..
Corona Cases in Telangana
రాష్ట్రంలో 1,231 ర్యాపిడ్ టెస్ట్ కేంద్రాలు, 34 ప్రభుత్వ ల్యాబ్‌లు, 76 ప్రైవేటు ల్యాబొరేటరీలున్నాయి. కేవలం ప్రభుత్వ ల్యాబ్‌లలోనే రోజుకు సుమారు 25వేల వరకూ ఆర్‌టీపీసీఆర్ పరీక్షలను నిర్వహించే సామర్థ్యం ఉంది. వీటి నిర్వహణకు ప్రస్తుతం 12 లక్షల కిట్లను కూడా అందుబాటులో ఉంచారు. జిల్లాల్లోని ప్రయోగశాలల్లో ఒక్కోచోట రోజుకు కనీసం 250-300 వరకూ పరీక్షలను నిర్వహించవచ్చు. కానీ అలా చేయడంలో అలసత్వం కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కొరవడిన పర్యవేక్షణ
Corona tests in telangana
నమూనాలను సేకరించేది ప్రజారోగ్య డైరెక్టర్ పరిధిలోని ల్యాబ్‌టెక్నీషియన్లే అయినా.. ప్రయోగశాలలన్నీ వైద్యవిద్య సంచాలకుడు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ పరిధిలో ఉన్నాయి. వీటిపై సరైన పర్యవేక్షణ కొరవడడంతో.. నిర్ధారణ పరీక్షల నిర్వహణలో జాప్యం జరుగుతోందనే విమర్శలున్నాయి. కొవిడ్ విజృంభిస్తోన్న ఈ సమయంలోనూ చాలా ల్యాబ్‌లు రెండు షిఫ్టులు కూడా పనిచేయడం లేదని తెలుస్తోంది. కేసుల పెరుగుదలను బట్టి నమూనాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఆ ప్రకారం ఎన్ని షిఫ్టుల్లో ప్రయోగశాలలను నిర్వహించాలనేది ఆధారపడి ఉంటుంది. ఇటువంటి అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో.. ఫలితాల వెల్లడి నత్తనడకన సాగుతోందనే ఆరోపణలున్నాయి. ‘‘రెండో దశలో నియమించుకున్న ల్యాబ్ టెక్నీషియన్లను, డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఆ తర్వాత తొలగించారు. దీనివల్ల సమాచారాన్ని పొందుపర్చేవారు కరవయ్యారు. ఫలితాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చడం ఆలస్యమవుతోంది’’ అని ఒక ఉన్నతాధికారి తెలిపారు. ‘‘ప్రయోగశాలల వ్యవస్థకు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం ఉంది. కనీసం ఇప్పటికైనా వాటిని పర్యవేక్షించడానికి రాష్ట్రస్థాయిలో ఒకరికి పూర్తి బాధ్యత అప్పగించాలి. ప్రభుత్వ ప్రయోగశాలల్లో నిర్ధారణ పరీక్షలను గాడిలో పెట్టాలి’’ అని అన్నారు.
ఇదీ చదవండి: మెదడుకు మస్కా!.. అసలేంటీ 'న్యూరాలింక్'?
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!