భారతదేశ సమగ్రత, అభివృద్ధి కోసం అందరితో ప్రేమగా వ్యవహరించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ఉద్బోధించారు. హైదరాబాద్‌లో ముడు రోజుల పాటు జరుగుతున్న విజయ సంకల్ప శిబిరంలో భాగంగా చివరిరోజు సంఘ పరివార్‌లో వివిధ క్షేత్రాలైన భాజపా, బీఎంఎస్, ఏబీవీపీ, కిసాన్ సంఘ్‌లోని ముఖ్యనేతలతో గంటన్నరపాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భాజపా నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్, జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు, ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, బండి సంజయ్, అర్వింద్, బాపురావు, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరయ్యారు.
ఏ మతానికి వ్యతిరేకం కాదు
భాషా విధానం తదితర అంశాలపై వివిధ క్షేత్రాల నేతల ప్రశ్నలకు భగవత్ స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టం, అనంతర పరిణామాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ మాట్లాడారు. హిందుత్వాన్ని కాపాడుకునేందుకు గట్టిగా పనిచేయాలని సూచించారు. ముస్లింలు, క్రిస్టియన్లు.. ఏ మతానికి హిందుత్వం వ్యతిరేకం కాదని.. ఆ మతాలవారిని రెచ్చగొట్టే నేతలకే వ్యతిరేకమని స్పష్టం చేశారు.
ప్రాంతీయ భాషకు ప్రాధాన్యతనివ్వాలి
వాస్తవాలను అందరికీ అర్థమయ్యేలా చూడాలని వివరించారు. సంఘ్ మాతృభాషకు ప్రాధాన్యమిస్తుందని... ఇంగ్లీష్ నేర్చుకోవాలి.. కానీ ఏ రాష్ట్రంలో అక్కడి ప్రాంతీయ భాషకు ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు. తెలంగాణలో 2024 నాటికి 5 లక్షల సభ్యత్వంతో 10వేల గ్రామాల్లో విస్తరించేలా కృషి చేయాలన్నారు.
ఇవీ చూడండి: 'ఒక్క ఎన్నికల్లో కూడా గెలవనివారు నా గురించి మాట్లాడుతున్నారు'