Round Table Meeting Telangana Opposition Parties: రాష్ట్రంలో కాక రేపుతున్న లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్షాలు మరోసారి విమర్శలు గుప్పించాయి. యువజనసమితి, విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో "పేపర్ల లీకేజీ- ప్రభుత్వ వైఫల్యం - నిరుద్యోగుల గోస" అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళీ, ఆచార్య పీఎల్. విశ్వేశ్వరరావు, ప్రొ. హర గోపాల్, పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ వ్యవహారంపై ఐక్యంగా ఉద్యమిస్తామన్న నేతలు.. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ఈ అంశంపై పోరాడాలని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పేర్కొన్నారు. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై ప్రశ్నిస్తే ప్రతిపక్ష పార్టీల నాయకులకు నోటీసులిస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షడు మల్లు రవి మండిపడ్డారు. ఐటీ మంత్రి కేటీఆర్ ప్రశ్నా పత్రం లీక్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదనడం సమంజసం కాదన్నారు. 30 లక్షల నిరుద్యోగుల సమస్యపై సీఎం ఎందుకు స్పందించడం ప్రొఫెసర్ హరగోపాల్ ప్రశ్నించారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి ఒక ఆర్డినెన్సును తీసుకురావాలని ఆకునూరి మురళి డిమాండ్ చేశారు. వివిధ పార్టీల నేతలు ప్రశ్నాపత్రాల లీకేజీని ముక్త కంఠంతో ఖండించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు.
"ప్రభుత్వ పాలన వల్లనే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ జరిగింది. సిట్‌కు కాకుండా సీబీఐకు ఎందుకు కేసు ఇవ్వలేదు. అభ్యర్థులకు నష్టపరిహారం చెల్లించాలని తీర్మానం చేసుకున్నాము. కేసును సీబీఐకు అప్పజెప్పాలని చెప్పి తీర్మానం చేస్తున్నాం. ముఖ్యమంత్రే ఈ లీకేజీకి బాధ్యత వహించాలి. ఈ లీకేజీలో దోషులు ఎవరన్న అంశాన్ని తేల్చే వరకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి." - ఆచార్య కోదండరాం, తెజస అధ్యక్షుడు
"సీఎం కేసీఆర్ తాను ఒక్కడినే తెలంగాణను తీసుకువచ్చాను అని అనడం ఏదైతే ఉందో అది అతని చరిత్ర తెలియకపోవడం, చరిత్రలో తన స్థానం ఏంటో తెలియకపోవడం తెలంగాణ విషాదం. పేపర్ లీకేజీ జరగడానికి మీరు బాధ్యత తీసుకుంటారా అనేది ప్రధాన ప్రశ్న. తెలంగాణలో పోరాట స్ఫూర్తి పోయిందని ఈ ప్రభుత్వానికి బాగా అర్థమయ్యింది. ఇప్పుడు మనం ఏం చేసినా చెల్లుతుంది. మనం ఇంక జాగ్రత్తపడాల్సిన అవసరం లేదు." - ప్రొ. హరగోపాల్
ఇవీ చదవండి: