దేశంలోని 554 సంస్థానాల్లోనే అతి పెద్దది హైదరాబాద్ సంస్థానం. వాస్తవానికి అది... సంస్థానం కాదు. సర్వస్వతంత్రుడు, బ్రిటీష్ సామ్రాజ్యవాదులకు నమ్మినబంటు, ప్రపంచంలోనే అత్యంత ఐశ్వర్యవంతుడు, 250 సంవత్సరాల అసఫ్ జాహీ వంశపాలకుల వారసుడు 7వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ఏలుతున్న రాజ్యం. సకల హంగులతో సువిశాలమైన రాజ్యం. స్వతంత్ర భారతంలో విలీనం కాబోమని, ప్రజాస్వామ్య, పౌరహక్కుల సమస్యే లేదని ఆజాద్ హైదరాబాద్ గా ప్రకటించుకున్న రాజ్యాధినేత. అలాంటి శక్తిమంతమైన వ్యవస్థతో తలపడి ప్రజావిముక్తి పోరాటం కోసం పాటుపడింది ఆంధ్రమహాసభ.
ఆంధ్ర మహాసభకు మాతృసంస్థ ఆంధ్ర జనసంఘం. తెలుగుభాష భాషా సంస్కృతుల రక్షణ కోసం 1921లో మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, మందుముల నరసింగరావు, ఆదిరాజు వీరభద్రరావు, రామస్వామి నాయుడు, టేక్‌మాల్ రంగారావు మొదలైన 11మంది ఏకాదశ రుద్రులు ఏర్పాటు చేసిన సంస్థ ఇది. ఆంధ్ర జనసంఘం లక్ష్యాలు... గ్రంథాలయ స్థాపన, తెలుగు శాసన ప్రతుల సేకరణ, లఘు పుస్తక ప్రచురణ, తెలుగు భాషను నేర్చుకోవడానికి పరీక్షల్ని నిర్వహించి, ప్రోత్సహించడం. అలా మొదలైన ఆంధ్ర జనసంఘం తెలుగు భాషా వ్యాప్తికి ప్రచారం చేస్తూనే నిజాం పెట్టిన ఆంక్షలను వ్యతిరేకిస్తూ నెమ్మదిగా వెట్టిచాకిరీ నిర్మూలన వంటి సామాజిక సమస్యల పైనా దృష్టి సారించింది.
సాహితీమార్గం నుంచి పోరుబాటకు మళ్లే క్రమంలో.. 1930నాటికి ఆంధ్ర జన సంఘం ఆంధ్ర మహాసభగా రూపు మార్చుకుంది. సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన తొలి మహాసభ జోగిపేటలో జరిగింది. అప్పట్నుంచి 1941లో రెండుగా చీలిపోయే వరకూ తెలంగాణ ప్రజలను జాగృతం చేయడానికి ఆంధ్ర మహాసభ విస్తృత కృషి చేసింది. చీలిక తర్వాత ఒక సంస్థ కమ్యూనిస్టుల నాయకత్వంలో అప్పటి అధ్యక్షులు రావి నారాయణరెడ్డి నేతృత్వంలో ఉద్యమాన్ని చేపట్టింది. మరొక సంస్థ మందుముల నరసింగరావు నాయకత్వంలో జాతీయవాద ఉద్యమ సంస్థగా ప్రచారం పొంది నెమ్మదిగా నిజాం స్టేట్ కాంగ్రెస్‌లో విలీనమైంది. ఇది ఒకరకంగా తెలంగాణ ఉద్యమ తొలిదశ.
1930లో ఆంధ్రమహాసభ ఏర్పాటుతో.. నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టినట్లైంది. జమిందార్లు, దేశముఖ్‌ల వెట్టి నుంచి విముక్తి కోసం ఉద్యమం ఊపిరి పోసుకుంది. ఆంధ్రమహాసభకు మొదటి నుంచి సాయుధ పోరు ఆలోచన లేక పోయినా... పీడిత సమాజం కోసం ఆయుధం పట్టక తప్పలేదు. 1944 భువనగిరిలో ఆంధ్రమహాసభ చేసిన దున్నేవాడిదే భూమి నినాదం పెను విప్లవానికి దారితీసింది. భూస్వాములకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించారు. 1946 లో దొడ్డికొమరయ్య హత్యతో అది పతాకస్థాయికి చేరింది. ఒక్కొక్కటిగా జరుగుతున్న పరిణామాలు ఉద్యమాన్ని అతివాదం నుంచి సాయుధపోరు వైపు నడిపించాయి. 1947 సెప్టెంబర్ 11 ఉద్యమానికి శిఖర సమానులైన రాజా బహద్దూర్ గౌర్, ముగ్గుం మొహియుద్ధీన్, బద్దం ఎల్లారెడ్డి సాయుధ పోరాట ప్రకటన చేశారు. వారి ముగ్గురి సంతకాలతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ప్రకటన వెలువడింది.
ఆంధ్రమహాసభ ఇలా కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్లాక ఉద్యమం పూర్తిగా సాయుధ రూపు సంతరించుకుంది. తెలంగాణ విమోచన తర్వాతా ఇది కొనసాగింది. ఉద్యమకారులు భారత ప్రభుత్వంపైనా తుపాకులు ఎక్కుపెట్టారు. 1948నిజాం సంస్థానంపై సైనిక చర్య అనంతకరం... 1951 వరకు సాయుధ పోరు కొనసాగింది. అప్పటి వరకూ గ్రామరక్షక దళాలు గ్రామకమిటీల ఆధ్వర్యంలోనే పాలన కొనసాగింది. సుదీర్ఘ ప్రజాపోరాటం ద్వారా భారత స్వాతంత్ర్యోద్యమానికి లభించిన ప్రఖ్యాతి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కూడా లభించింది. పీడనపై ప్రజలు సాధించిన ఈ విజయాన్ని, విజయగాథలు ప్రపంచ వ్యాప్తంగా వినిపించాయి.
ఇదీ చదవండి:
1.ప్రతి పల్లె... తెలంగాణ జలియన్ వాలాబాగే...! వందలాది భగత్‌సింగ్‌లు, చెగువేరాలు
2.Veera Bairanpally revolt : రజాకార్ల రాక్షసత్వాన్ని ఎదురించిన వీరభూమి బైరాన్‌పల్లి