‘సార్.. మూడురోజుల నుంచి నా చరవాణికి పదుల సంఖ్యలో అసభ్య చిత్రాలు, వీడియోలు వస్తున్నాయి.. తొలగించే కొద్దీ వచ్చేస్తున్నాయ్.. ఎవరు పంపిస్తున్నారో తెలీదు, వాట్సాప్ చూడగానే ఇవి ఉంటున్నాయ్.. బొమ్మ బాగుంది.. పండగ చేస్కో! అన్న వ్యాఖ్యలు కింద రాస్తున్నారు. వీటిని పంపిస్తున్న వారికి నా ఫోన్ నంబరు ఎలా తెలిసిందో అర్థం కావడం లేదు.. పగలూరాత్రీ తేడా లేకుండా ఈ వీడియోలు వస్తున్నాయి. ఇలా నాలుగైదు నంబర్ల నుంచి వాట్సాప్ సందేశాలు వస్తున్నాయి, ఈ విషయాన్ని మా ఇంట్లో చెప్పలేదు, వీటిని ఎవరు పంపుతున్నారో గుర్తించి అరెస్ట్‌చేసి జైలుకు పంపండి’’
సికింద్రాబాద్‌లో ఓ ప్రముఖ విద్యా సంస్థలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సైబర్ క్రైమ్ పోలీస్ అధికారితో అన్న మాటలివి. ఈ తరహా వేధింపులు ఎక్కువగా ఇంటర్ విద్యార్థినులతో పాటు డిగ్రీ విద్యార్థినులు, యువతులకు కొనసాగుతున్నాయి. కళాశాలల విద్యార్థినులు, యువతులు, మహిళ ఫోన్ నంబర్లు వేర్వేరు మార్గాల ద్వారా తెలుసుకుంటున్న పోకిరీలు, సైబర్ నేరస్థులు అసభ్య చిత్రాలు, వీడియోలను పంపుతున్నారు. ఇక బాధితులకు పరిచయమున్న మరికొందరు మెయిల్, ఫేస్‌బుక్ ఖాతాల ద్వారా పదేపదే వేధిస్తున్నారు. వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల దృశ్యాలుంచి వారి పరువుకు భంగం కలిగించేలా ప్రవరిస్తున్నారు. ఈ ఏడాది వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయని సైబర్ క్రైమ్ పోలీసులు వివరిస్తున్నారు.
కళాశాలలు.. ఫేస్‌బుక్ ఖాతాలు
విద్యార్థినులు, యువతులు, మహిళల చరవాణులు, ఈ-మెయిల్ వివరాలను పోకిరీలు, సైబర్ నేరస్థులు కళాశాలలు, ఫేస్‌బుక్ ఖాతాల ద్వారా తెలుసుకుంటున్నారు. వీటితో పాటు ట్విట్టర్‌లలో ఖాతాల వివరాలను సేకరిస్తున్నారు. కళాశాలల్లో చదువుకునే కొందరు విద్యార్థులు సహ విద్యార్థినులతో పరిచయం పెంచుకుని.. ప్రేమిస్తున్నాం అంటూ చెబుతున్నారు. వారు తిరిస్కరించిన వెంటనే వేధింపులు ప్రారంభిస్తున్నారు. స్నేహితుడే కదా అని వారితో ఎప్పుడైనా సరదాగా బయటకు వెళ్లుంటే తరువాత ఆ ఫోటోలను ఫేస్‌బుక్‌లో ఉంచుతున్నారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న యువతులను లక్ష్యంగా చేసుకుని వారిని కూడా వేధిస్తూ వెంటాడుతున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగానికి వస్తున్న ఫిర్యాదుల్లో 80శాతం విద్యార్థినులు, యువతులకు ఫేస్‌బుక్‌లలో వేధింపులవే అని అధికారులు తెలిపారు. కళాశాలల్లో వేడుకలు, సినిమాలు, కుటుంబ సభ్యులతో విందులకు వెళ్లినప్పుడు అపరిచితులతో ఎక్కువగా మాట్లాడవద్దని పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపుతున్నారు.
జైలుకు పంపుతున్నారు..
సైబర్ క్రైమ్ విభాగానికి వస్తున్న ఫిర్యాదుల్లో 90శాతం వరకు సాంకేతిక ఆధారాలుంటున్నాయి. ఈ-మెయిల్స్, ఫేస్‌బుక్‌లతో పాటు సామాజిక వేదికల్లో అసభ్య సందేశాలుంటే వాటి సీడీలను తీసుకుంటున్నారు. బాధితుల మనో వేదన, మానసిక పరిస్థితిని స్వయంగా పరిశీలించిన పోలీస్ ఉన్నతాధికారులు ఫిర్యాదు తీవ్రత ఆధారంగా నిందితులపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఐటీ చట్టంపై కేసు నమోదు చేసి అరెస్ట్‌చేసినా వెంటనే బెయిల్‌పై బయటకు వస్తున్నారని గుర్తించారు. దీంతో తీవ్రత ఉన్న ప్రతి కేసులో ఐటీ చట్టంతో పాటు ఐపీసీ 509, 506 సెక్షన్లను అదనంగా నిందితులపై నమోదు చేస్తున్నారు. ఫోన్‌లో బెదిరించినా, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా నిందితుడు ప్రవర్తించినా నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నామని పోలీస్ అధికారులు తెలిపారు .ఇప్పటికే 69 మంది నిందితులపై నిర్భయ చట్టం కింద అరెస్ట్‌చేసి జైలుకు పంపించామన్నారు. అసభ్య సందేశాలు, వీడియోలు వచ్చిన వెంటనే విద్యార్థినులు, యువతులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే... తాము వేగంగా స్పందిచడంతో పాటు శిక్షించేందుకు వీలుంటుందని వివరించారు.
ఇదీ చూడండి: నగరంలో చీకటి పడితే చాలు గల్లీకో గాంధారి పుత్రుడు..