Hyderabad Roads Damage Due to Rains : హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన వర్షాలకు.. రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. వర్షం ప్రభావంతో గతుకులతో పాటు, కంకర తేలి ప్రమాదకరంగా మారాయి. నగరవ్యాప్తంగా 9 వేల 103 కిలోమీటర్ల రహదారులు విస్తరించి ఉండగా.. 811 కిలోమీటర్ల రోడ్ల పర్యవేక్షణను జీహెచ్‌ఎంసీ మూడేళ్ల క్రితం వరకు ప్రైవేట్ నిర్వహణకు అప్పగించింది. అందుకోసం ప్రైవేట్ గుత్తేదారు సంస్థలకు.. ఇప్పటి వరకు రూ.1,100 కోట్లు చెల్లించింది. నాలాల కోసం జీహెచ్‌ఎంసీ గుంతలు తవ్వి వదిలేస్తే.. మురుగు నీటి పైపులైన్ల కోసం జలమండలి చేపట్టిన తవ్వకాలతో దారులన్నీ దారుణంగా తయారయ్యాయి.
Roads Damage Hyderabad : సరూర్‌నగర్, యూసఫ్‌గూడ, బోరబండ, కృష్ణానగర్, గాజుల రామారం, కూకట్‌పల్లి సహా శివారు మున్సిపాలిటీల్లోని రోడ్లు మురికి కుంటలను తలపిస్తున్నాయి. సమగ్ర రహదారి నిర్వహణ కింద చేపట్టినవి మినహా మిగిలిన వాటిపై జీహెచ్‌ఎంసీ గత మూడేళ్లలో రూ.2 వేల కోట్లు ఖర్చు చేసింది. వర్షాకాలం వస్తే రహదారుల నిర్వహణ పేరిట రూ.కోట్లు దుర్వినియోగం అవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాసిరకం రోడ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Hyderabad Roads Damage : ప్రైవేట్ నిర్వహణకు ఇచ్చిన రోడ్లను ఏజెన్సీలు పట్టించుకోవడం లేదని రోడ్లను చూస్తే అర్థమవుతుందని.. ఇంత జరుగుతున్నా ఇంజినీర్లు సైతం గుత్తేదారులను ప్రశ్నించకపోవడం ఏంటని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రోడ్లను వేసి ఆ తర్వాత మర్చిపోవడం వల్లే ఇలాంటి దుస్థితులు నెలకొంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ముసురుకే రూ.వందల కోట్లతో నిర్మించిన రోడ్లు ధ్వంసమయ్యాయని స్థానికులు మండిపడుతున్నారు. ప్రైవేట్ నిర్వహణకు ఇచ్చిన రహదారులు సైతం మట్టి రోడ్లను తలపిస్తున్నాయని.. ఇక కాలనీ రోడ్లు మరింత దారుణంగా మారాయని వాపోతున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ విభాగాల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుందని మండిపడుతున్నారు.
పంచాయతీరాజ్ రోడ్లదీ అదే పరిస్థితి.. : మరోవైపు.. పంచాయతీరాజ్ రోడ్లూ భారీగా దెబ్బతిన్నాయి. సుమారు వందకు పైగా రోడ్లు ధ్వంసం కాగా.. పంచాయతీరాజ్ శాఖకు రూ.140.34 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో రోడ్లు తెగి కొట్టుకుపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 55 కిలోమీటర్ల మేర రోడ్లు కోసుకుపోయాయి. ధ్వంసమైన రోడ్లపై ప్రయాణించడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. దెబ్బతిన్న రోడ్లు తాత్కాలిక మరమ్మతుల కోసం సుమారు రూ.64 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
సర్ఫేజ్ రోడ్లు సుమారు వంద రోడ్ల వరకు దెబ్బతిన్నాయి. 68.26 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు అంచనాలు వేశారు. సీడీ వర్క్స్ (క్రాస్ డ్రైనేజీ)కి సంబంధించిన రోడ్లు 77 వరకు దెబ్బతిన్నాయి. వీటి తాత్కాలిక మరమ్మత్తుకు రూ.2.60 కోట్లు, పూర్తిస్థాయి మరమ్మత్తుకు రూ.58.63 కోట్లు ఖర్చవుతాయని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. తాత్కాలిక, పూర్తిస్థాయి మరమ్మత్తులకు కలిపి రూ.61.23 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.
ఇవీ చూడండి..
వర్షానికి యాదాద్రిలో బయటపడ్డ లోపాలు.. కొనసాగుతున్న దిద్దుబాటు చర్యలు