ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని.... పరిమిత వేగంతో వెళితే ప్రమాదాలను నివారించే ఆస్కారముందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. కుటుంబ యజమాని ప్రమాదంలో చనిపోతే... ఆ కుటుంబం మొత్తం వీధిన పడే ప్రమాదముంటుందని.... ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకుంటేనే రహదారి ప్రమాదాలను తగ్గించొచ్చని మహమూద్ అలీ అన్నారు. సరూర్ నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో రాచకొండ పోలీసులు జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను నిర్వహించారు. ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
ఆటో, లారీ, బస్సు డ్రైవర్లతో పాటు.. కళాశాల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తలెత్తే పరిణామాలు, శిరస్త్రాణం లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, చరవాణిలో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల జరిగిన ప్రమాదాలను దృశ్యాల ద్వారా ట్రాఫిక్ పోలీసులు వివరించారు. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ మార్షల్స్ బృందాల కార్యక్రమాన్ని మంత్రులు పువ్వాడ అజయ్, మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు.
ఇవీ చదవండి: కార్పొరేట్‌ను తలదన్నేలా.. ప్రభుత్వ విద్య: మంత్రి కేటీఆర్